Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూరగాయలు, కంది పంటలకు నష్టం
నవతెలంగాణ- విలేకరులు
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు పడ్డాయి. సాయంత్రం ఒక్కసారి వాతవరణం మేఘావృతమై దాదాపు గంటపాటు వడగండ్లతో కూడిన వర్షం పడింది. దాంతో కూరగాయలు, కంది పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఇంద్రవెల్లి, నార్నూర్, ఆదిలాబాద్ రూరల్, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇదే క్రమంలో చలి తీవ్రత పెరిగింది. ఇంద్రవెల్లి మండలంలో కందితోపాటు కూరగాయల పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసిన కంది పంటను ఒక చోటికి చేర్చి రైతులు కుప్పలుగా పేర్చారు. రేపోమాపో హార్వెస్ట్లో తీద్దామనుకునేలోపే వర్షం కురిసింది. కూరగాయల పంటలైన క్యాబేజీ, టమాట, మిర్చి, బీరకాయ, కాకర, ఆల్చింత తదితర పంటలకు నష్టం జరిగింది. గత ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాలతో ఇప్పటికే కూరగాయల ధరలు కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా వర్షంతో ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నార్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో గంటసేపు వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పత్తి, కంది పంటల కాయలు రాలిపడ్డాయి. అలాగే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలో వడగళ్లతోపాటు వర్షం కురవడంతో పొలంలోని కందులు నానిపోయాయని రైతులు తెలిపారు. కెరమెరి మండలంలో గంటపాటు వడగండ్ల వర్షం కురిసింది.