Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండలో రూ.146 కోట్లతో ఐటీ హబ్, అభివృద్ధి పనులు
- 31న ప్రారంభించాలి : అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- నల్లగొండ జిల్లాలో పర్యటన ొ గాదరి మారయ్య దశదినకర్మకు హాజరు
- కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ - నల్లగొండ
'నల్లగొండ రూపు రేఖలు మారాలే..రూ.110 కోట్లతో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి. మరో 36 కోట్లతో రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లను కూడా ఏర్పాటు చేయాలి. ఈనెల 31న మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులతో శంకుస్థాపన చేయాలి' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నల్లగొండ పట్టణంలో పర్యటించారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య దశదినకర్మలో పాల్గొన్నారు. మారయ్య చిత్ర పటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూములు, దళితబంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై చర్చించారు. ప్రధానంగా నల్లగొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికల రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.110 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్ ఏర్పాటు, మరో రూ.36 కోట్లతో రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు వెంటనే ప్రణాళికలు రూపొందించా లని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను ఆదేశించారు. పానగల్ రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని, శిల్ప కళాతోరణం, నూతన డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి, రోడ్ల వెడల్పు, నూతన టౌన్‌హాల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెల 31న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాలని చెప్పారు. అనంతరం సీఎం పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్, టౌన్‌హాల్, నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, రవీంద్రనాయక్, నోముల భగత్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.