Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రకృతి వైపరీత్యాలు, సర్కారు నిర్లక్ష్యం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఈమేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రైతుల్లో భరోసా నింపేందుకు మంత్రుల బందం వెంటనే పొలాల్లోకి వెళ్లి పరిశీలించాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. గడిచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మదంగం మోగుతున్నదనీ, ప్రతిరోజు ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ధాన్యపు రైతులు ఇబ్బందులు పడుతుండగా, మిర్చి రైతుల మెడకు ఉరితాళ్లు బిగుసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి కేవలం ఐదు క్వింటాళ్లు రావడమే గగనంగా మారిందని పేర్కొన్నారు. ఒకవైపు పంట నష్టం, మరోవైపు తెచ్చిన అప్పు వడ్డీతో సహా తీర్చే మార్గం లేక రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి సవ్యంగా ఉన్నట్టు మంత్రులు మాట్లాడటం సరైందికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులకు భరోసా ఇచ్చేందుకు సర్కారు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు స్థానికులను, స్థానికేతరులుగా మార్చి ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న జీవో నెంబర్ 317 రద్దు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. గురువారం ఈమేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు.