Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ- మేడ్చల్ కలెక్టరేట్
మతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కేంద్రంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువైనాయన్నారు. వాటిని నిలువరించడంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమవుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. లేకపోతే అదే పామై కరుస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం భూ పోరాటాలను ఉదృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో మార్క్సిజం, లెనినిజాన్ని మించిన ప్రజానుకూల సిద్ధాంతం మరొకటి లేదన్నారు. ఇటీవల చీలీకి 35 ఏండ్ల వామపక్ష నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. మోడీ అధికారం లోకొచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ, తిరోగమన విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, సామాన్య ప్రజల నడ్డి విరిచారన్నారు. రైతులు మోడీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. పోరాడితే విజయం మనదే నన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాల బతుకులను ఛిద్రం చేస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం లాంటి కేసీఆర్ ఎన్నికల హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ భూముల పరిరక్షణకు వ్యవసాయ కార్మికులు రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర నాయకులు వి.ఎస్.బోస్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఏసురత్నం, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్శింహా ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, జాతీయ నాయకులు టి.వెంకట్రాములు, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కాంతయ్య, ఎన్.బాలమల్లేశ్
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో 71 మందితో నూతన కౌన్సిల్ను, 21 మందితో కార్యదర్శి వర్గాన్ని, 11 మందితో ఆఫీసు బేరర్స్ను ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా కాంతయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎన్.బాలమాల్లేష్ ఎన్నికయ్యారు.