Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ సెక్షన్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పీసీసీఎఫ్ ఆర్.శోభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతనంగా నియమితులైన అటవీ శాఖ సెక్షన్ అధికారులపై బాధ్యత పెరిగిందనీ, వారంతా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ సూచించారు. గురువారం దూలపల్లిలోని ఫారెస్టు అకాడమిలో ఆరు నెలల శిక్షణ ముగించుకున్న 27 మంది సెక్షన్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. వారి నుంచి పీసీసీఎఫ్ ఆర్.శోభ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పర్యావరణ మార్పులు, అడవులపై ఒత్తిడి కారణంగా అటవీ అధికారులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. 27 మంది అధికారులతో కూడిన 20 వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారుల ఆరు నెలల శిక్షణా కార్యక్రమం ఈ యేడాది జూన్ 14న ప్రారంభమై డిసెంబర్ 30తో ముగిసింది. అడవుల్లో విధులు, ఎదురయ్యే సవాళ్లు, రక్షణ, సంబంధిత అంశాలపై ఈ శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగా వెపన్, సర్వే ట్రైనింగ్‌లపై ప్రత్యేక శిక్షణ ఫారెస్ట్ అకాడమిలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో పి.రవి (అసిఫాబాద్ డివిజన్) ప్రథమ స్థానంతో పాటు, క్రీడల్లోనూ ప్రతిభ చూపి ఓవరాల్ ఆల్ రౌండర్‌గా నిలిచారు. మారథాన్ పరీక్షలో 12 కిలోమీటర్ల మారథాన్‌లో ఆర్. మాన్యమయ్య(గంటా 30 నిమిషాలు) మహిళల విభాగంలో జె. స్నేహశ్రీ (గంటా 40 నిమిషాలు) ప్రధమ స్థానాలు పొందారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి అకాడమి సంచాలకులు, అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి పీ.వీ. రాజారావు, అటవీ సంరక్షణ అధికారి(రిటైర్డ్) డాక్టర్ జి.నర్సయ్య, కోర్సు డైరెక్టర్ వి. రామ్మోహన్, అకాడమీ అధికారులు పాల్గొన్నారు.