Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి కార్యక్రమాల్లో పాటించని ప్రోటోకాల్: సీపీఐ(ఎం) కార్పొరేటర్ యర్రా గోపి నిరసన
నవతెలంగాణ-గాంధీచౌక్
టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సంబంధిత అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఖమ్మంనగరంలోని 31వ డివిజన్ సీపీఐ(ఎం) కార్పొరేటర్ ఎర్రా గోపి విమర్శించారు. పాలకులు, అధికారుల తీరును నిరసిస్తూ ఖమ్మం త్రీ టౌన్ బోస్‌బొమ్మ సెంటర్లో ఆ పార్టీ నాయకులతో కలిసి గురువారం రాస్తోరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రా గోపీ మాట్లాడుతూ.. అధికారులు, అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల పంపిణీ, ప్రారంభోత్సవాలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డివిజన్లో మంత్రుల పర్యటన ఉన్నా, ప్రారంభోత్సవాలున్నా సమాచారం ఇవ్వకపోవడం, అభివృద్ధి పనుల శిలాఫలకాలపైన కార్పొరేటర్ పేరును పొందుపర్చకుండా ప్రొటోకాల్ పాటించని ఎమ్మార్వో, ఆర్ఐ, వీర్వోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నిరసనలో భాగంగా జనవరి 2న ఖమ్మం పర్యటనకు వస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.అన్వేష్, బి.పాపారావు కె.రాము, డి.శ్రీను, ఎస్కె.అజ్జు, జమీర్, సోమనాద్రి, టి.రాధ, ఆవుల శ్రీను, ఆర్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.