Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-జహీరాబాద్
అకాల మరణం పొందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌కు గురువారం అభిమానులు, ప్రజాప్రతినిధుల అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాగారెడ్డి స్టేడియం కిక్కిరిసిపోయింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి.ఫరీదుద్దీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి మృతిచెందారు. ఆయన అకాల మరణంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భౌతికకాయాన్ని సందర్శకుల కోసం జహీరాబాద్ లోని బాగారెడ్డి స్టేడియంలో ఉంచారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలు తరలివచ్చి ఫరీదుద్దీన్‌ను చివరి చూపు చూసారు. ఐటీ మంత్రి కేటీఆర్, ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టేడియా నికి వచ్చి ఫరీదుద్దీన్‌కు నివాళ్లు అర్పించారు. స్టేడియం నుంచి అంతిమ యాత్ర సాగింది. పట్టణంలోని ఈద్గా వరకు ఊరేగింపు చేసి.. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన స్వగ్రామమైన హౌతి(బి)కి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఫరీదుద్దీన్ సేవలు చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
ఫరీదుద్దీన్ సేవలు చిరస్మరణీయం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన అంతక్రియల్లో పాల్గొని.. ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఫరీదుద్దీన్ మృతి రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటన్నారు. జహీరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ గుర్తుండి పోతాయని చెప్పారు.