Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగం స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడదాం
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు
- సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ
నవతెలంగాణ-సుల్తాన్ బజార్/ రామన్నపేట
విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక, రాజకీయ అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, తాళ్ల నాగరాజు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సంఘం జెండాలు ఆవిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడారు. రైతాంగ పోరాట స్పూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. భుమి, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన మహా పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, కవి, రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్ నిజాం కాలేజీలో జెండావిష్కరణలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐలో ఉన్న విద్యార్థులు బాగా చదువుకోవాలని, విద్యతోపాటు సామాజిక రాజకీయ అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వాలు అనుసరించే తప్పుడు విధానాలను ప్రశ్నించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు. కాలేజీ ప్రొఫెసర్లు రమణ, జానకిరెడ్డి, మనోహర్‌తో కలిసి భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి, నిజాం కాలేజీ కమిటీ నాయకులు శ్రీమాన్ నాయక్, శేఖర్, సందీప్, గణేష్, కార్తిక్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కుషి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్శిటీలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముడావత్ తారాసింగ్ జెండావిష్కరణతో పాటు భగత్‌సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
ఆదిలాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు లంక రాఘవులు జెండాను ఆవిష్కరించి భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ 1970లో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుంచి విద్యార్థుల పక్షాన నిలబడి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు కొనసాగిస్తూ వస్తోందన్నారు. మంచిర్యాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి తిరుపతి జెండా ఆవిష్కరించారు.