Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనవరి ఒకటి నుంచి వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన కోరారు. జీఎస్టీ కౌన్సిల్లో పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు వల్ల దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమలు పూర్తిగా కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆయా పరిశ్రమలపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికులకు ఈ నిర్ణయం సమ్మెట పోటులాంటిదని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో జీఎస్టీ పెంపు విషయంలో వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను, జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. లేదంటే టెక్స్టైల్, అప్పారెల్ యూనిట్లు నషాల్లో మునిగిపోతాయని తెలిపారు.