Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో మంత్రి కేటీఆర్కు నల్ల జెండాలతో నిరసన తప్పదు
- వామపక్ష రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘాలు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
జనవరి 2వ తేదీన ఖమ్మం పర్యటనకు వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు నల్ల జెండాలతో నిరసన తెలపాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(న్యూడెమోక్రసీ), కాంగ్రెస్, రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. గురువారం ఖమ్మంనగరంలోని సుందరయ్యభవన్లో జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశంలో నాయకులు నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు, మిక్కిలినేని నరేంద్ర మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేయగా.. ఎడ తెరిపిలేని తెగుళ్ళు, వైరస్లతో పూర్తిగా దెబ్బ తిన్నదన్నారు. దాంతో గత నెల రోజులుగా జిల్లాలో ఆరుగురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు శాంతియుతంగా ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించినా అధికారులు, అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం స్పందించలేదనీ, మిర్చి రైతుల పట్ల నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సమస్యను వ్యవసాయ శాఖ అధికారులైన ఏఓ నుంచి రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ స్థాయికి తీసుకెళ్ళినా నిమ్మకునీరెత్తినట్టుగా ఉండటం శోచనీయమన్నారు. రైతుల పట్ల బీజేపీ ఎంత మొండిగా వ్యవహరించిందో టీఆర్ఎస్ కూడా అలాగే ఉందన్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందిస్తారో తెలపాలన్నారు. ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మిర్చి రైతుల కోసం మంత్రి కేటీఆర్కు నిరసనల సెగ తప్పదన్నారు. ఈ లోపు పరిహారంపై స్పందిస్తే ఆలోచిస్తామన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, వై.విక్రం, ఆవుల అశోక్, రైతు సంఘాల నాయకులు కొండపర్తి గోవిందరావు, గుర్రం అచ్చయ్య, మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, మరీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.