Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ కౌన్సిల్లో ఐదు శాతానికి కుదించాల్సిందే
- వస్త్రాలపై 12శాతం జీఎస్టీ తగదు
- ఉద్యమించకపోతే వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి : తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.ప్రకాశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టెక్స్టైల్ రంగంపై మోడీ సర్కారు 12 శాతం జీఎస్టీని విధించి సర్జికల్స్ట్రైక్కు పూనుకున్నదని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.ప్రకాశ్ విమర్శించారు. బట్టల వ్యాపారం చేసుకునేటోళ్లు రోడ్లెక్కి ఉద్యమించే స్థితికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్లో వస్త్రాలపై పన్నును ఐదు శాతానికి కుదించి రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ పరిశ్రమను కాపాడాలని చేతులెత్తి వేడుకున్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం ఒకరోజు తిండి, కొన్ని రోజులు ఇల్లు లేకపోయినా నెట్టుకురావచ్చుగానీ ఒంటిమీద బట్ట కట్టుకోకుండా ఉండలేమన్నారు. అలాంటి వస్త్రపరిశ్రమపై 12 శాతం జీఎస్టీ ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల 75 లక్షల నుంచి కోటి మంది వరకు టెక్స్టైల్ ట్రేడర్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం వల్ల వస్త్రవ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదనీ, ఇప్పటికే సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. కరోనా ఎఫెక్ట్‌తో తొమ్మిది శాతం బట్టల దుకాణాలు మూతపడ్డాయని చెప్పారు. విపత్తు సమయంలో నష్టాల్లో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతను మరిచి దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు. 28 శాతం కేటగిరీలో ఉన్న చాలా ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని 12 శాతానికి కుదించిందనీ, ప్రతి ఒక్కరికీ అవసరమైన బట్టలపై మాత్రం 12 శాతానికి పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వస్త్రోత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకుపై నాలుగు నెలల్లో 32 నుంచి 40 శాతం ధరలు పెరిగాయనీ, మళ్లీ 12 శాతం శాతం జీఎస్టీ విధిస్తే రేట్లు అమాంతం పెరిగి సామాన్యులకు అందని పరిస్థితి వస్తుందని చెప్పారు. ఫలితంగా వ్యాపారాలూ దెబ్బతింటాయని వాపోయారు.
టెక్స్టైల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్రావు మాట్లాడుతూ..కరోనాతో 19 నెలలుగా వస్త్రవ్యాపారం దెబ్బతిన్నదన్నారు. వాటిపై 12 శాతం జీఎస్టీ విధిస్తే రాష్ట్రంలో25 శాతం బట్టల షాపులు మూతపడే ప్రమాదం ఉందని వాపోయారు. అదే జరిగితే వేలాది మంది అన్‌స్కిల్డ్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. రాష్ట్రంలో 17 మంది ఎంపీలకు, 28 రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులకు, కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్‌గోయల్‌కు లేఖలు రాశామని తెలిపారు.
శుక్రవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వేడుకున్నారు. ది హైదరాబాద్ హోల్‌సేల్ ఆర్ట్ సిల్క్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పురుషోత్తమ్ గుప్తా మాట్లాడుతూ.. వస్త్రవ్యాపారం చేసే చిరువ్యాపారులు, ఇండ్లలో బట్టలమ్మే గృహిణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చిన్న, మధ్యతరహా బట్టల దుకాణాల వాళ్లు మరణం అంచున ఉన్నారని చెప్పారు.