Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగతో ఉపాధ్యాయుడి హఠాన్మరణం
- ఊరు విడిచి వెళ్లలేక మనోవేదన..
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 'జీఓ 317' ఉపాధ్యాయుడి కుటుంబంలో చిచ్చు పెట్టింది. బదిలీ బెంగతో ఊరిని విడవలేక ఉపాధ్యాయుడు మనోవేదనతో గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబంతోపాటు ఉపాధ్యాయ లోకాన్ని కన్నీరు మున్నీరు చేసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బంజర గ్రామ శివారులోని సంధ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు బానోతు జేతురామ్ (55) నెల్లికుదురు మండలంలోని చెట్ల ముప్పారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కాగా జీఓ నెంబర్ 317 ఆధారంగా అధికారులు ఆయన్ను ఇటీవలే ములుగు జిల్లాకు కేటాయించారు. ఈ క్రమంలో జేతురామ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. త్వరలోనే ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో కుటుంబాన్ని, పుట్టి పెరిగిన స్వస్థలాన్ని వీడి వెళ్లాల్సి వస్తోందంటూ పలువురి వద్ద వాపోయాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ఆయన్ను గమనించి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
ప్రభుత్వం చేసిన హత్య : మల్లారెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
జేతురామ్ హఠాన్మరణం ప్రభుత్వం చేసిన హత్యే అని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆయన బాధిత కుటుంబాన్ని ఏరియా ఆస్పత్రి వద్ద పరామర్శించారు. జోనల్ వ్యవస్థ ప్రకారం భార్యాభర్తలను ఒకే ప్రాంతానికి కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు భిన్నంగా కేటాయింపులు చేపట్టి జేతురామ్ ప్రాణాలను బలిగొందని ఆవేదన చెందారు. జీఓ నెంబర్ 317 అంతు పట్టడం లేదన్నారు. రోజుకో రకంగా నిబంధనలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేదనకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జీఓ 317ను రద్దు చేయడంతోపాటు జేతురామ్ మృతి పట్ల బాధ్యత వహిస్తూ అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.