Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బ్యాంకులు సహకరించాలి
- 'రెరా' మరింత పటిష్టం కావాలి
- మధ్యతరగతి గృహాలకు రాయితీలివ్వాలి : క్రెడారు ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
క్రెడారు హైదరాబాద్ ప్రాపర్టీ షో-2022ను ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రామకృష్ణారావు, వీ రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జీ ఆనంద్‌రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్‌రెడ్డి, బీ జగన్నాధరావు, కోశాధికారి ఆదిత్యగౌర తెలిపారు. గురవారంనాడిక్కడి క్రెడారు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రాపర్టీషోలో రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి పొందిన ఆస్తుల్ని మాత్రమే ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. డెవలపర్లు, మెటీరియల్ వెండర్లు, బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చరర్లు, కన్సల్టెంట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్టూషన్స్ సహా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నట్టు వివరించారు. 'రెరా' అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనీటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఈ ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఆర్థిక, వాణిజ్య, ఉపాధి కల్పనా సంస్థలు వస్తున్నాయనీ, ఫలితంగా సొంతిండ్లకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు. గృహ రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా ఈ రంగం పురోభివృద్ధికి కారణమని విశ్లేషించారు.
జాతీయబ్యాంకులు సహకరించాలి
రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధికి జాతీయ బ్యాంకులు సహకరించాలని క్రెడారు ప్రతినిధులు కోరారు. జాతీయ బ్యాంకులు ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఫండింగ్ చేయట్లేదన్నారు. గుర్గావ్ తదితర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు ఏవో మోసాలు చేశారని, అందర్నీ ఒకే గాటన కట్టేసి చూడటం సరికాదన్నారు. జాతీయ బ్యాంకుల్లో లీడ్‌బ్యాంక్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన విధానాలను మార్చుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆ బ్యాంక్ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామన్నారు.
జాతీయ బ్యాంకుల ఈ వైఖరి వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదని చెప్పారు. ఈ విషయంలో ప్రయివేటు బ్యాంకులు రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి అండగా నిలుస్తున్నాయనీ, అక్కడ లేని నష్టభయం జాతీయ బ్యాంకులకు ఎందుకని ప్రశ్నించారు.
టీఎస్‌బీపాస్ పటిష్టం చేయాలి
భవన నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని క్రెడారు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో అన్ని శాఖలకు సంబంధించిన అనుమతులు ఇస్తున్నారనీ, అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు ఈ విధానంలో ఉన్నాయని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
'రెరా' చెక్ ఉండాల్సిందే..
రియల్ ఎస్టేట్రంగంపై నియంత్రణా వ్యవస్థ ఉండాల్సిందేనని క్రెడారు ప్రతినిధులు స్పష్టంచేశారు. తాము ఈ వ్యవస్థను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే దానిలోనూ అనేక సమస్యలు ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. 'రెరా'లో ఇప్పటికీ అడహక్ చైర్మెన్‌తో నడుస్తున్నదనీ, బోర్డులో సభ్యుల నియామకం జరగలేదని చెప్పారు. నాలుగేండ్లుగా తాము ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నామన్నారు. మార్కెట్ నియంత్రణలో ఉంటేనే ఆయా సంస్థలపై ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుందని వివరించారు.
రాయితీలివ్వండి...
పేద, మధ్య తరగతి ప్రజల కోసం సౌకర్యవంతమైన గృహాల నిర్మాణానికి (అఫర్డబుల్ హౌసెస్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు ఇవ్వాలని క్రెడారు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎమ్ఏవై) స్కీంలో ఇప్పటికీ ఐదేండ్ల క్రితం నాటి నిబంధనలే అమల్లో ఉన్నాయన్నారు. ఈ స్కీం ప్రకారం ఇంటి నిర్మాణం రూ.45 లక్షల లోపే ఉండాలనే నిబంధన విధించారనీ, దీన్ని కనీసం రూ.60 లక్షలకు పెంచాలని కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో రూ.45 లక్షలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఈ స్కీం క్రింద కట్టే ఇండ్లకు భూమి, ఇండ్ల రిజిస్ట్రేషన్ చార్జీల్లో రాయితీలు ఇవ్వాలని కోరారు. భూమి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు ఐదేండ్ల క్రితం నాటి నిబంధనల అమలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
2022లో భూమి రేట్లు పెరగవు
వచ్చే ఏడాదిలో భూమి రేట్లు పెద్దగా పెరిగే అవకాశాలు లేవని క్రెడారు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పెరగాల్సిన స్థాయికంటే ఎక్కువగా ధరలు పెరిగాయనీ, వాటిలోనే వచ్చే ఏడాది స్వల్ప మార్పులు జరుగుతాయే తప్ప, పెద్దగా ధరలు పెరిగే అవకాశం లేదన్నారు. అలాగని ధరలు తగ్గవని స్పష్టం చేశారు. అందరికీ ఇల్లు క్రెడారు నినాదం అనీ, దాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అంతకుముందు ప్రాపర్టీ షో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్రెడారు జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.