Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 23,24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
- తెలంగాణలో అన్ని సంఘాలు ఐక్యంగా జయప్రదం చేయాలి : సీఐటీయూ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా2022 ఫిబ్రవరి 23, 24తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టి న సమ్మెను రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ఫెడరేషన్లు ఐక్యంగా జయప్రదం చేయాలని సీఐటీ యూ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత పిలుపు నిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పారిశ్రామిక ప్రాంత కార్యకర్తల ముఖ్య సమావేశం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్ అధ్యక్షతన జరిగింది. పారిశ్రామిక క్లస్టర్ల సమన్వయ కమిటీ కన్వీనర్ భూపాల్ సమ్మె జయప్రదం కోసం కర్తవ్యాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా అన్ని తరగతుల కార్మికులను కలిసి చైతన్యం చేయాలన్నారు. ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ సమ్మెలో పాల్గొని ఉత్పత్తిని స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇటీవల కాలంలో విద్యుత్, బ్యాంక్ ఉద్యోగులు సమరశీలంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరా టాలకు మోడీ ప్రభుత్వం తలొగ్గి ఉపసంహరించుకుందన్నారు. రానున్న కాలంలో కార్మికవర్గం మరింత సంఘటితంగా ఉద్యమాలు చేయాలని, అం దుకు తెలంగాణ కార్మికవర్గం ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె. వెంకటేష్, బి.మధు, ఉపాధ్యక్షులు బి.మల్లేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, నాయకులు రాజయ్య, అశోక్, దాసరి పాండు, ఎ.మల్లేశం, బొట్ల చక్రపాణి, కురుమూర్తి, నాగేశ్వర్, బ్రహ్మచారి, యాదగిరిరావు, అజరుబాబు, గోపాలస్వామి, ఎడ్ల రమేష్, జగదీష్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.