Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి రచ్చబండకు వెళ్లకుండా అడ్డగింత
- పోలీసుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్ లేఖ
- మంత్రులను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భూపాలపల్లిలో నిర్వహించతలపెట్టిన చర్చబండకు వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. రైతుల సమస్యలు తీసుకోవడంతోపాటు ఇటీవల మరణించిన పార్టీ స్థానిక నాయకుల కుటుంబాలను పరామర్శించేందుకు రేవంత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తననివాసం నుంచి శుక్రవారం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అయన్ను అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా రేవంత్‌ను కట్టడి చేశారు. అనుమతిలేకుండా పోలీసులు తన ఇంట్లోకి రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పరా మర్శించేందుకు కూడా రాష్ట్రంలో స్వేచ్ఛ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కల్గిస్తున్నారనీ, పదే పదే గృహనిర్బంధం, అరెస్టు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో స్వేచ్ఛను హత్య చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఇండ్లలోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇండ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లకుండా నిర్భందకాండ ప్రయోగిస్తున్నారని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోంది. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతిభవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయి. జాగ్రత్త కేసీఆర్' అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ప్రయివేటు ఎస్టేట్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రైతులు చస్తుంటే, పరామర్శించడం నేరమా? మంత్రులు, ఎమ్మెల్యేల శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడపడం లేదా? అని నిలదీశారు. సీఎం స్థాయిలో మీరేలాగో పరామర్శలకు వెళ్లరు..కనీసం తమకైనా సహకరించాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317తో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు.పోలీసుల ముళ్లకంచెలు తమను అపలేవనీ,అవసరమైతే జైల్‌భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు.