Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీటి విడుదల
- చెరువులు నింపాలని అధికారుల సూచన
నవతెలంగాణ-మెండోరా
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు ఈఈ చక్రపాణి, ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు కాకతీయ కాలువ ద్వార సాగునీరు విడుదల చేశారు.ప్రభుత్వం ఆదేశాల మేరకు యసంగి పంటలకు నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. పంటల చివరి వరకు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని వివరించారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా చెరువులను నింపుకోవాలని సూచించారు. కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 300, సరస్వతి కాలువకు 600, వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని యసంగి పంటలకు నీటిని అందిస్తూ అలీసాగర్ ఎత్తిపోతలకు 540 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథ ధ్వార 152 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేసినట్టు తెలిపారు.ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తూ కాకతీయ కాలువకు 4,06,412 ఎకరాలకు, సరస్వతి కాలువకు 35,735 ఎకరాలకు, లక్ష్మి కాలువకు 25,755 ఎకరాలకు సాగునీటిని అందిస్తూ చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నింపుతున్నట్టు తెలిపారు. రొటేషన్ సిస్టమ్లో సాగు నీటిని విడుదల చేస్తూ వారబంధిగా హెచ్చుతగ్గులు చేస్తూ కాకతీయ, సరస్వతి, గుత్ప ఎత్తిపోతలకు నీటి విడుదల సరఫరా చేయనున్నారు. కాకతీయ కాలువకు 39.31 టీయంసిలు, సరస్వతి కాలువకు 4.17 టీయంసిలు, లక్ష్మి కాలువకు 3.18 టియంసిలు, అలీసాగర్ , గుత్ప ఎత్తిపోతలకు 9.28 టియంసిల సాగునీటిని అందిస్తూ ప్రాజెక్టు నుంచి పూర్తిగా 60.12 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పుర్తిస్తాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.50 అడుగులు (87.561 టీఎంసీల) నీరు నిలకడగా ఉందని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బురుకల సుకన్య కమలాకర్, జడ్పీటీసీ తలారి గంగాధర్, వైస్ ఎంపీపీ పడాల సరస్వతి రవీందర్ గౌడ్, రైతు సమన్వయ కో-ఆర్డినేటర్ సాయిరెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ బాబ, పోచంపాడ్ గ్రామ సర్పంచ్ మిస్బోద్దిన్, సొన్ పెట్ డైరెక్టర్ జక్కయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.