Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖ(గ్రేహౌండ్స్)కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 లోని 142.39 ఎకరాలు ప్రభుత్వ భూమేనని తీర్పు వెలువరించింది. సుమారు 11 ఏళ్ల న్యాయపోరాటంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ టి.తుకారాంజీల నేతత్వంలోని ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. రియల్టర్లు, కబ్జాదారులు, జీపీఏ హౌల్డర్ల పేరుతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నాలను బ్రేక్ వేసింది. వేల కోట్ల రూపాయల విలువైన భూమి ప్రభుత్వానిదేనని చెప్పింది. అసైన్డ్ భూముల షరతులను మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పింది. కబ్జాదారులు అనేక విధాలుగా రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేందుకు చేసిన ప్రయత్నాలకు హైకోర్టు ఫుల్‌స్టాఫ్ పెట్టింది. ఒక దశలో పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడితే సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా మళ్లీ ఒక కేసు తర్వాత మరో కేసు, అసైనీలు, ఆ తర్వాత జీపీఏ ప్రట్టాదారులు, జీపీఏ హౌల్డర్ ఏకంగా 71 రిజిస్ట్రేషన్లు చేయడం.. ఇలా పలు కోణాల్లో వివాదాలు సష్టిస్తూ కేసులు వేసి సర్వశక్తులు ఒడ్డినా చివరికి ఫలించలేదు. మంచిరేవుల గ్రామంలోని భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు చెప్పింది.
కేసు వివరాల్లోకి వెళితే..
మంచిరేవుల గ్రామంలోని 391/1 నుంచి 391/20 సర్వే నెంబర్లో ఉన్న 142.39 ఎకరాలను 1961 అక్టోబర్ 21న తహసీల్దార్ 20 మందికి అసైన్ చేశారు. 1958 జులై 25 నాటి జీవో 1406 నిబంధనలకు అనుగుణంగా 20 మందికి అసైన్మెంట్ భూమిగా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 1994 మార్చి 28న ఏపీ (తెలంగాణ ఏరియా) ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం అసైనీలకు నోటీసులు జారీ చేశారు. భూమిలో తాత్కాలిక అనుమతులు ఎందుకు ఇచ్చారో వివరణ కోరింది. రెవెన్యూ రికార్డుల్లోని ఫసలీ ప్రకారం భూమి స్వరూపం మార్చకూడదన్నారు. దీనిపై అదే ఏడాది సెప్టెంబర్ 15న రంగారెడ్డి జిల్లా డీఆర్ఓ ఇచ్చిన ఆదేశాల్లో.. 'తహసీల్దార్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోం..' అని చెప్పారు. దీనిని కలెక్టర్ సుమటోగా విచారణకు స్వీకరించి తహసీల్దార్ ఇచ్చిన అసైనీ ఉత్తర్వులను రద్దు చేశారు. దీనిపై మైలారం మల్కయ్య ఇతరులు 1995 మే 25న ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ వద్ద సవాల్ చేశారు. అదే ఏడాది బీపీఏ హౌల్డర్లు హైకోర్టులో రెండు రిట్లు దాఖలు చేశారు. ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కోరారు. రెండు రిట్లను 1997 సెప్టెంబర్ 1న హైకోర్టు అనుమతించింది. వాటికి అనుకూలంగా తీర్పులు కూడా వచ్చాయి. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసినా హైకోర్టులో ఫలితం లేకపోయింది. ప్రభుత్వ అప్పీళ్లను తోసిపుచ్చుతూ 1998 సెప్టెంబర్ 14న, 2000 జనవరి 22న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1995లో కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్, సివిల్ కోర్టులోని వివాదాలనకు అనుగుంగా చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు 2000 ఏప్రిల్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అసైనీలతో జీపీఏ హౌల్డర్లు చేతులు కలిపారని కలెక్టర్ గుర్తించారు. ఇతర లావాదేవీలు నిర్వహించుకునేలా జీపీఏ చేసుకుని మళ్లీ భూవివాదానికి బీజాలు వేశారు. కలెక్టర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసైనీ ఎం.నర్సింహ ఇతరులు 2003/2005 సంవత్సరాల్లో హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. రెండోసారి అసైనీలు దాఖలు చేసిన కేసుల్లో తమ వాదనలు వినాలని, ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.. వీటిపై హైకోర్టు 2006 ఏప్రిల్ 21న హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకుంటే పరిహారం చెల్లించాలని, 44 ఏండ్లు ఉన్న భూమిని వాళ్ల నుంచి తీసుకోవడం చెల్లదని సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ప్రభుత్వ కేటాయింపులతో గ్రేహాండ్స్ పోలీసులు 142.39 ఎకరాల భూమిని రాజేందర్‌నగర్ తాహసీల్దార్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పంచనామా కూడా జరిగిపోయింది. సేల్ డీడ్ డాక్యుమెంట్స్‌ను 2007 జనవరి 27న రిజిస్టర్ చేయించి మళ్లీ వివాదం ఏర్పడేలా చేశారు. ఏకంగా 71 భూమి అమ్మకపు లావాదేవీలు అమలు చేశారు. జీపీఏ హౌల్డర్ అల్లా భక్షి చనిపోయాడని, జీపీఏ చెల్లదని అసైనీలు మళ్లీ పోరాటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎం.జంగయ్య మరో 45 మంది 2007లో దాఖలు చేసిన కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి 2010లో వెలువరించిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషనర్లకు పరిహారం ఇవ్వకుండా, భూసేకరణ చట్టం అమలు చేయకుండా గ్రేహాండ్స్కు కేటాయింపు చేయడం సరికాదన్న ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్‌ను 2010లో దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 21న తుది వాదనలు పూర్తి కావడంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పును వెలువరించింది. భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. భూకబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అధికారులు చేసిన కషిని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. రూ. 10 వేల కోట్ల విలువైన 142.39 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు ఆమోదించింది. పేదలకు గతంలో ఇచ్చిన ఆభూములను స్వాధీనం చేసుకోవడాన్ని సమర్ధించింది. పేదలకు ఇచ్చిన భూమి అన్యాక్రాంతం అయినప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమేనని చెప్పింది. గతంలో పలు విషయాలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు చెప్పారని తప్పుపట్టింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
'న్యూ ఇయర్ వేడుకల'పై నాలుగున విచారణ
నూతన సంవత్సర వేడుకలను ఆపేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అమలు జరిగేలా చూడాలని రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. కరోనా నియంత్రణ మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి నాలుగున జరిగే విచారణలో నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఒమిక్రాన్ రూపంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ లాయర్ చిక్కుడు ప్రభాకర్ వేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలను నిషేధించాయని, అదేమాదిరిగా ఇక్కడ కూడా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పైగా మద్యం అమ్మకాల వేళలను ప్రభుత్వం పొడిగించిందని, దీనిని కూడా అడ్డుకోవాలని కోరారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల మేరకు 144 సెక్షన్ విధించాలని కోరారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 100 శాతం మందికి మొదటిడోసు వ్యాక్సిన్ ఇచ్చారు. 66 శాతం మందికి రెండో డోసు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అంత తీవ్రమైన పరిస్థితులు లేవన్నారు వాదనల తర్వాత హైకోర్టు.. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఏ రెస్టారెంట్లో లేని తరహాలో న్యాయస్థానాల్లో న్యాయవాదులు భౌతిక దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో కోర్టులను మూసేయాలి కదా..? అని ప్రశ్నించింది. విచారణను ఈనెల నాలుగుకు వాయిదా వేసింది.
పదోన్నతులు పొందిన వారికి సన్మానం...
రాష్ట్రానికి చెందిన రిటైర్డు న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, నిరూప్... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులుగా పదోన్నతి పొందిన నేపథ్యంలో వారిద్దరినీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం శుక్రవారం సత్కరించింది. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి చెంగల్వ కల్యాణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.