Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్యలు 838, లైంగికదాడిలు 2,382
- నాలుగు రెట్లు పెరిగిన సైబర్ క్రైం
- మిస్సింగ్ కేసులు 16,956
- మోసాల కేసులు 14,666
- 2020తో పోలిస్తే4.6 శాతం పెరిగిన నేరాలు
- అయినా...శాంతిభద్రతలు ప్రశాంతం
- 2021 వార్షిక నేర నివేదిక ప్రకటించిన డీజీపీ ఎమ్ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో/ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నేరాలు పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో 4.6 శాతం మేర నేరాల సంఖ్య పెరిగింది. హత్యలు, మహిళలపై లైంగికదాడులు, మోసాలు, దోపిడీలు, మిస్సింగ్ కేసులు సహా అన్నీ పెరిగాయి. అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ ఎమ్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారంనాడాయన 2021 వార్షిక నేరాల నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాదిలో దోషులకు శిక్షలు వేయించడంలో పోలీసులు విశేషంగా కృషి చేశారని ఆయన చెప్పారు. సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాలు సహజంగానే పెరుగుతాయనీ, వాటిని నివారించేందుకు పోలీస్‌యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నేరాల అదుపుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులు మినహా మరెక్కడా లేవన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికి పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి ఆపరేషన్స్ చేపడుతున్నట్టు చెప్పారు. 98 మంది మావోయిస్టులు అరెస్టు కాగా 133 మంది లొంగిపోయారనీ, మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఏడాది పోలీసు శాఖలో కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదనీ, గతేడాది రిక్రూట్ చేసిన మూడు వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్వీసులో తీసుకున్నామని వివరించారు. పోలీసుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్దను వహిస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిదులను కేటాయిస్తున్నదని చెప్పారు. సైబర్ వారియర్స్‌తో పాటు సీసీ కెమెరాల నిర్వాహణ వంటి అంశాల్లో ప్రత్యేకంగా 15కు పైగా జాతీయ అవార్డులు వచ్చాయని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడమే కాదనీ, వారికి శిక్షలు పడితేనే నేరం చేయడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 50.03 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. పెండ్లి పేరుతో మోసం/పొరుగువారు/సహౌద్యోగులు/ బంధువులు, స్నేహితులు/గుర్తుతెలియని దుండగులు చేసిన లైంగికదాడుల కేసులు 2,382 ఈ ఏడాది నమోదయ్యాయి. రాష్ట్రంలో 8.50 లక్షల సీసీ కెమెరాలను అమర్చామనీ, మరో మూడు, నాలుగు నెలల్లో కమాండ్కంట్రోల్ రూం అందుబాటులోకి వస్తుందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వేలి ముద్రల టెక్నాలజీనీ ఏర్పాటు చేసి, వందల కేసుల్లో నిందితులను గుర్తించామన్నారు. సమాజంలో ఆసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న 664 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించామన్నారు. సీసీ కెమెరాల ద్వారా 22,781 కేసులనుకు సంబంధించిన ఆధారాలు సేకరించగలిగామనీ, షీటీమ్స్‌లో 515 ఫిర్యాదులు రాగా, వాటిని సమగ్రంగా దర్యాప్తు జరిపి న్యాయం చేశామన్నారు. 2021లో లక్షా 32వేల 906 ఎప్ఐఆర్లు నమోదు అయ్యాయనీ, మరో 838 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని వివరించారు. హత్యలు, లైంగికదాడుల కేసులు పెరిగాయనీ, అయితే వాటిని సామాజికకోణంలో అధ్యయనం చేస్తూ, విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. గడచిన ఏడేండ్లలో 15,758 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ.98 కోట్ల నష్ట పరిహారాన్ని అందించామన్నారు. మహిళలపై 17,058 వేధింపు కేసులు నమోదయ్యాయనీ, 33 వరకట్న హత్యలు, కట్నం కోసం 8429 కేసులు దాఖలైనట్టు తెలిపారు. పోక్సో చట్టం క్రింద 2,567 కేసులు నమోదు చేశామనీ, 17,429 ఆస్తిపరమైన నేరాలు నమోదయ్యాయన్నారు. పలు నేరాల్లో రూ. 113 కోట్ల సొత్తు దోపిడీ కాగా.రూ.53 కోట్ల ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ గోవింద్‌సింగ్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనీల్‌కుమార్ సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నేరాలిలా...
కేసులు 2020 2021
కిడ్నాప్ హత్యలు 44 85
దారి దోపిడీలు 30 37
దోపిడీలు 305 441
భారీ దొంగతనాలు 3,476 4,335
ఇతర దొంగతనాలు 8,330 12,531
హత్యలు 660 838
హత్యానేరాలు 198 389
అల్లర్లు 708 488
పిల్లలు, ఇతర అపహరణ కేసులు 1,033 1,218
అత్యాచారాలు 1,934 2382
భౌతికదాడులు 18,059 17,854
మోసాలు 9,072 14,666
మిస్సింగ్ కేసులు 14,698 16,956
పెట్టీ కేసులు 6,23,666 4,80,852
రోడ్డు ప్రమాదాలు-పెనాల్టీలు
కేసులు 2020 2021
రోడ్డు ప్రమాదాలు 16,898 19,248
మరణాలు 6,033 6,690
క్షతగాత్రులు 16,591 18,316
పెనాల్టీ వసూళ్లు రూ.672 కోట్లు రూ.877 కోట్లు
మోటారు వాహన కేసులు 1,67,98,946 2,22,55,363