Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాసు సురేశ్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చేనేత వస్త్రాలు, హస్తకళలపై జీఎస్టీ పూర్తిగా ఉపసంహరించుకోవాలని నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలపై 12శాతం జీఎస్టీ విధించాలనే నిర్ణయాన్ని 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉపసంహరించుకుంటూ ఐదు శాతానికి కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్టీని తగ్గించాలంటూ కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి, కేంద్ర జౌళి శాఖ సెక్రటరీ యూపీసింగ్ను కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అదే విధంగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సైతం కోరామనీ, తమ అభ్యర్ధనను పరిశీలించి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరించారు. చేనేత రంగ ప్రయోజనాల కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒక్క తాటిపై రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన రూ 5 లక్షల చేనేత బీమా, రూ 10 లక్షల చేనేత బంధు పథకాలను త్వరగా అమలు చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న 350 మంది బాధిత కుటుంబాలకు రూ 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమా ండ్ చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను వెంటనే ప్రారంభించాలనీ, చేనేత వర్గానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
చేనేతపై జీఎస్టీ వద్దు : ఎల్ రమణ
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని జీరో చేసేదాక ఉద్యమం కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేతపై 5 శాతం పన్నును యధావిధిగా కొనసాగిస్తామంటూ కేంద్రం ప్రకటించడం తాత్కాలిక కంటితుడుపు చర్య మాత్రమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి నుండి చేనేతపై జీరో జీఎస్టీ ఉండాలని ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ విధించి చేనేతలకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఆ పన్ను ఉపసంహరణ విషయాన్ని వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తంతుగా చూడాల్సి వస్తున్నదని హెచ్చరించారు. దేశంలో వినియోగించే చేనేత ముడి సరుకులు, ఉత్పత్తులపై జీరో జీఎస్టీ నిధించాలంటూ నిర్ణయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.