Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తా..పాత సంవత్సరాల్లేవ్..అన్ని రోజులూ బాధలే
- పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరల భారం
- సింగిల్ ఛారు రూ.10.. ఫుల్ కావాలంటే రూ.15
- మామూలు, మధ్యరకం హోటళ్లలో ప్లేటు టిఫిన్ రూ.30 నుంచి రూ.50
- లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.2 పెరుగుదల
- ఆటోచార్జీలూ రెట్టింపు
- ఇలాగైతే బతికేదేలా: సామాన్యుడు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ అయ్యప్ప టెంపుల్. రోడ్డుపక్కన 'ఆటో..ఆటో' అంటూ ప్రయాణికుని కేకలు..కొంచెం ముందుకెళ్లాక ఆపి 'ఎక్కడికి సార్' అంటూ ఆటోడ్రైవర్ అడిగాడు. 'కామినేని దగ్గరకు' అంటూ ప్రయాణికుడు చెప్పాడు. ''20 రూపాయలైతది సార్'' అని ఆటోడ్రైవర్ అన్నాడు. 'పది రూపాయలే కదా?' అని ప్రయాణికుడు నసిగాడు. '20 రూపాయలైతే ఎక్కండి లేకుంటే లేదు. టైం వేస్ట్ చేయకండి. రోజంతా నడిపినా ఇల్లు గడిసేది కష్టమైతాందిగానీ పదిరూపాయలకు ఎక్కించుకోవాలంట?'అంటూ ఆటోడ్రైవర్ వెళ్లిపోయాడు. కిలోమీటర్న్నరకు రూ.20నా? ఆ పైసలు ఇంట్లో దేనికైనా అవసరమొస్తయిలే' అని గునుక్కుంటూ ప్రయాణికుడు నడుచుకుంటూ బయలుదేరాడు. డాడీ వడ అయితేనే తింటా అంటూ పిల్లాడి మారం. 'రెండు రోజుల నుంచి వాడేం తింటలేదు. జర దెచ్చిపెట్టు' అంటూ భార్య వేడుకోలు. మధ్యాహ్నం 12 గంటలు. వడ కోసం వెంకట్ చాలా హోటళ్లు వెతికాడు. రెండు కిలోమీటర్లు వెళ్లాక ఓ హోటల్లో కనిపించింది. అక్కడా రెండే పీసులున్నాయి. 'అమ్మయ్యా దొరికినరయ్యా' అని మనుసులో అనుకుంటూ బిల్లెంత అంటే...రూ.50 స్లిప్ చేతిపెట్టాడు. 'ఇదేంటి? రెండు వడలు రూ.50నా?'అని బిక్కమొహం వేసుకుంటే గ్యాస్ ధర రూ.300 పెంచారు. మేమూ పెంచాం' అంటూ హోటల్ యజమాని సమాధానం. అత్యవసరం. తీసుకోక తప్పుతుందా? అంటూ జేబులో ఉన్న రూ.50 చేతిలో పెట్టి పట్టుకెళ్లాడు.
కార్లు ఉన్నోళ్లు కార్లలో తిరుగుతున్నరు..డబ్బులున్నోళ్లు పెద్దపెద్ద హోటళ్ల తింటున్నరు... ఎటొచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం వల్ల అంతిమంగా సమిదలవుతున్నది సామాన్యులే అని పై రెండు ఘటనలు ఉదహరిస్తున్నాయి. ఓవైపు గ్యాస్ ధరల పెరుగుదల...ఇంకోవైపు నిత్యావసరాల ఫిరంతో అనివార్యంగా టిఫిన్ రేట్లు పెంచారు. తినేవారు తగ్గడంతో బండ్ల వ్యాపారుల బిజినెస్ కూడా దెబ్బతింటున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా అంతిమంగా నష్టపోతున్నది వీరే. ఇవే కాదండోరు. పొద్దస్తమానం బయట పనిమీద తిరిగి అలసిపోయి కనీసం సింగిల్ చారు తాగాలన్నా పదిరూపాయలు జేబులో నుంచి తీయాల్సిందే. నలుగురు దోస్తులు కలిస్తే చారు తాగాలంటే డబ్బులిచ్చే దగ్గర ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఫుల్ చారుకైతే ఒక్కో దానికి రూ.15 వెచ్చించాల్సిందే. కొంచెం పెద్ద హోటళ్లయితే చారు ధర రూ.20 కూడా ఉంది. చారుధర పెంచడానికి కారణం ఏమిటని అడిగితే 'మేం వాడే గ్యాస్బండలపై ఒక్కో దానిపై రూ.300పైగా పెంచారు. టీ, కాపీ పొడి, పాలప్యాకెట్ల ధరలు పెరిగాయి. నష్టాలకు నడుపుకోలేం గదా! మేమూ పెంచాల్సిందే కదా?' అంటూ ఓ టీకొట్టు యజమాని చెప్పాడు. వాణిజ్య అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరపై ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రూ.266 పెంచడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని క్షేత్రస్థాయిలో స్పష్టంగా అర్ధమవుతున్నది.
గ్యాస్ బండకు వెయ్యి ఒడవాల్సిందే..
రెంటు తగ్గాలంటే మెట్లు ఎక్కాల్సిందే..
ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబానికి సగటున నెలకో గ్యాస్ బండ అవసరం. ప్రస్తుతం ఇండ్లల్లో వాడే ఒక్కో సిలిండర్ ధర రూ.937 ఉంది. సిలిండర్ తెచ్చే బారు ఫోర్లను బట్టి రూ.30 నుంచి రూ.50 వరకు (మొదటి అంతస్తు వరకు రూ.30, రెండో అంతస్తు రూ.40, మూడో అంతస్తు 50) వసూలు చేస్తున్నారు. సాధారణంగా కింద ఫోర్లలో యజమానులే ఉంటారు. మొదటి, రెండో అంతస్తుల్లో సింగిల్ బెడ్ రూ.7 వేల వరకు ఉంటున్నది. ఇక సామాన్యులు ఉంటున్న మూడో, నాలుగో ఫోర్లలనే కొంచెం రెంట్లు తక్కువ. అక్కడ ఉండే వారి రెంటు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటున్నది. సామాన్యులు నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మిగిలితే కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నాలుగైదు ప్లోర్లు మెట్లు ఎక్కుకుంటూ పోతున్న పరిస్థితి. దీనిని బట్టి చూస్తే ఈ విషయంలోనూ ఎక్కువ నష్టపోతున్నది పేదలే.
పాల ప్యాకెట్ల ధరలూ పెరిగినరు
పలు రకాల బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలూ లీటరుకు రెండు రూపాయల చొప్పున పెరిగాయి. విజయ డెయిరీ కూడా లీటర్‌కు రెండు రూపాయలు, అరలీటర్ ప్యాకెట్‌పై ఒక రూపాయి పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రూ. 24 ఉన్న అరలీటర్ పాల ప్యాకెట్ ధర ఇక నుంచి అధికారికంగా రూ.25 కానున్నది. అదే షాపుల్లో రూ.26 అమ్మనున్నారు. సాయంత్రం అయితే ఫ్రిజ్‌లో కూలింగ్ పెట్టామనే పేరుతో కొన్ని షాపుల వాళ్లు రూ.27 నుంచి రూ.28 తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని చాలా దుకాణాల వద్ద జీరాక్సు తీసి యజమానులు అంటించారు. ఒక్కపాల ప్యాకెట్ ధర పెరగడం వల్లనే ఒక్కో కుటుంబంపై నెలకు రూ.60 నుంచి రూ.100 వరకు భారం పడనున్నది.
ఏ కూరగాయలు కొనబోయినా కిలో రూ.50 పైనే..
కూరగాయల రేట్లపైనా పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఏ కూరగాయ ముట్టినా రైతు బజార్లలోనే కిలో రూ.50పైనే పలుకుతున్నది. వీధుల్లో తిరిగి అమ్మేవారు, ప్రధాన సెంటర్లలో బండ్ల మీద పెట్టుకుని అమ్ముకునే వారైతే పై రేట్లకు అదనంగా రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.బతకాలంటే తినక తప్పదు కాబట్టి భారమైనా కొంటున్నారు.
టమాట-రూ.50 నుంచి రూ.60
చిక్కుడు - రూ.80
క్యారెట్ - రూ.80
క్యాప్సికం - రూ.70
గోకరకాయ - రూ.60
ఆలుగడ్డ - రూ.40
బెండకాయ - రూ.60
వంకాయలు - రూ.60
దొండ - రూ.50
సొరకాయ(ఒక్కోటి) - రూ.30