Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీసాయిసేవా ఆశ్రమం పీఠాధిపతి రామణానంద అరెస్ట్
- ఆశ్రమం భూమి కోసమే కుట్ర : సభ్యులు
నవతెలంగాణ- బొమ్మలరామారం
యాదాద్రిభువనగిరి జిల్లాలో బాలికపై లైంగికదాడి కేసులో శ్రీసాయి సేవా ఆశ్రమం పీఠాధిపతి రామణానంద ప్రభూజీని అరెస్టు చేశారు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం... బొమ్మలరా మారం మండలంలోని పెద్దపర్వతాపూర్ గ్రామ శివారులో గల శ్రీసాయి సేవ ఆశ్రమం పీఠాధిపతి రమాణానంద ప్రభూజీ 2018లో తనపై లైంగికదాడి చేశాడని డిసెంబర్ 30న (గురువారం) 16ఏండ్ల బాలిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆశ్రమానికి వెళ్లి స్వామీజీని అదుపులోకి తీసుకొని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 1991లో శ్రీసత్య సదానంద ప్రభూజీ అలియాస్ డాక్టర్ సి.ప్రభాకర్‌రావు విరాళాలు సేకరించి సాయి ధామం పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఆయన శిష్యునిగా చేరిన కోదండరామిరెడ్డి అలియాస్ రమణానందను పీఠాధిపతి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి సాయి ధామం సాయి సేవ ఆశ్రమంలోని అన్ని పనులను రమణానందనే చూస్తున్నాడు. పీఠాధిపతులు సత్య సదానంద మరణానంతరం ఉచిత స్కూల్ స్థాపనకు కృషి చేసిన గురూజీ శిష్యురాలు మాతాజీ సతీశుఖవాణి సాయి ధామం పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఆమె కూడా చనిపోవడంతో రమాణానంద పీఠాధిపతులుగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, సీడబ్ల్యూఎస్ వారు ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడు ఓ బాలికను ఈ ఆశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి అదే ఆశ్రమంలో చదువుకుంటూ ఉంటున్న తనపై రమణానంద పలుమార్లు లైంగికదాడి చేశాడని డిసెంబర్ 30న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అదేరోజు రాత్రి రమణానందను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదంతా కూట్రపూరితం : సభ్యుల ఆరోపణ
ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ట్రస్టు సభ్యులు పేర్కొంటున్నారు. ఆశ్రమ భూమి 33ఎకరాలను చేజిక్కించుకోవడం కోసమే కొంతమంది స్వామిజీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మూడేండ్ల కిందట లైంగికదాడి జరిగితే.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో మఫ్టీలో వచ్చి స్వామీజీని దుర్భాషలాడుతూ కొట్టుకుంటూ తీసుకువెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు.