Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, పరిశ్రమ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
- నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించి ఆ ఫలాలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, హాస్టల్ భవనాలను ప్రారంభోత్సవం చేసి, ఆ తర్వాత ఐటీహబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా కేంద్రంలో రూ.110కోట్లతో ఐటీ హబ్ ఏర్పాటుతో సుమారు 1500 మంది స్థానిక యువతకు ఉపాధి లభించనున్నట్టు తెలిపారు. వచ్చే 18నెలల్లో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని కూడా తామే ప్రారంభిస్తామన్నారు. ఐటీ హబ్ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇక్కడే సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ కేంద్రలో 5 బస్తీ దవాఖానాలు, రూ.4.50కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.3కోట్లతో వైకుంఠదామాలు ఏర్పాటు చేస్టున్నట్టు ప్రకటించారు. రోడ్ల అభివృద్ధి కోసం గతంలోనే రూ.100 కోట్లు ప్రకటించినప్పటికీ కరోనా వల్ల రూ.30కోట్లు మాత్రమే విడుదల చేశామని, మిగతా రూ.70కోట్లు కూడా విడుదల చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో తరిమికొట్టామన్నారు. గ్రీన్ ఇండిస్టియల్ పార్క్ ఏర్పాటు చేసి యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటి రంగంలో ఇప్పటికే 16లక్షల ఉద్యోగాలిచ్చామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తమకంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు చూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, టీఎస్ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, శానంపుడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.