Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వం కోల్పోయిన వలస కార్మికులు
- చాదర్‌ఘాట్ రోడ్డు పక్కన ఘటన
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు వచ్చారు.. రోడ్డు పక్కన గింత స్థలంలో గుడిసెలు వేసుకుని.. వెదురు బొంగులతో బుట్టలు అల్లుతూ.. వాటితో వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లాపాపలతో జీవనం సాగిస్తున్న ఆ పేదలు ఒక్కసారిగా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మొత్తం 40 గుడిసెలు కాలిపోయాయి.. సామాన్లు.. చేసిన రెక్కల కష్టం బుట్టలు, పైసా పైసా కూడబెట్టుకున్న కష్టం ఫలితమూ బూడిదై.. సర్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం శుక్రవారం హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాదర్‌ఘాట్ రోడ్డు పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆస్తినష్టం వాటిల్లినా ప్రాణనష్టం జరగకపోవడంతో పోలీ సులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన 30 కుటుంబాల వారు బతుకుదెరువు కోసం సిటీకి వలసొచ్చి చాదర్‌ఘాట్ సాయిబాబా దేవాలయం సమీపంలోని మూసీనది ఒడ్డున సుమారు 40 గుడిసెలు వేసుకున్నారు. వాటిల్లో నివాసముంటూ వెదురు కట్టెలతో బుట్టలు అల్లి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక గుడిసెలో వంట చేస్తుండగా పొయ్యి నుంచి పెద్దగా వచ్చిన మంటతో గుడిసెకు నిప్పంటుకుంది.
ఈ మంటలు కాస్తా సమీపంలో ఉన్న మరో 40 గుడిసెలకు తాకడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గుడిసెల్లోని వారు పిల్లలను తీసుకొని ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగెత్తారు. ఈ క్రమంలో గుడిసెల్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్దఎత్తున శబ్ధంతో మంటలు లేచాయి. ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, భిక్షపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం నుంచి ఐదు ఫైరింజన్లను రప్పించారు. నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు మూడు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కష్టపడి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, నగదు, వంట సామాగ్రి, బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. పేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ప్రమాదంవల్ల సర్వం కోల్పోయిన గుడిసెవాసులను గనౌఫౌండ్రి డివిజన్ బీజేపీ నాయకులు ఓంప్రకాశ్ బిశ్వా, ఆర్.నాగేశ్వర్ రావు పరామర్శించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.