Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య
- టీఎస్‌యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిని ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డైరీ అనేది గతాన్ని సమీక్షించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి దిక్సూచిగా ఉపయోగపడుతుందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నూతన డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శినిని ఆయన శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యమ కార్యకర్తలకు డైరీ రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. రోజూ బోధించాల్సిన పాఠాలను నోట్ చేసుకోవడంతోపాటు దైనందిన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గుర్తుంచుకోవడానికి డైరీలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలు రాసిన డైరీలను సంఘ కార్యాలయంలో అప్పగించాలని కోరారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా నూతన కార్యకర్తలు ఉద్యమ గతిని అవగాహన చేసుకుంటారని వివరించారు.
యూటీఎఫ్ డైరీలో విద్యారంగం, ఉపాధ్యాయులకు సంబంధించిన విలువైన సమాచారం ముద్రించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1980లో మొట్టమొదటగా డైరీని ముద్రించిన ఘనత యూటీఎఫ్దేనని గుర్తు చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ గతేడాది అధికభాగం కోవిడ్‌తోనే ముగిసిపోయిందని చెప్పారు. దీంతో విద్యారంగం తీవ్రంగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా కోవిడ్ ప్రమాదం పూర్తిగా తొలగిపోకున్నా అవసరమైన జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహిస్తూ ఈ ఏడాదైనా విద్యాబోధన సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 317పై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చెలరేగిన ఆందోళనలతో గతేడాది ముగియడం విచారకరమని అన్నారు. ఈ ఏడాదిలో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలో అవసరమైన సవరణలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలొన్న భయాందోళనలను దూరం చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రికా సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, సీనియర్ నాయకులు పి కృష్ణమూర్తి, ఎంఎకె దత్, డి మస్తాన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సింహాచలం, శ్యామ్‌సుందర్, జగన్నాథ్, వందన, అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.