Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్
నవతెలంగాణ-నల్లగొండ
వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతం పెంపును వాయిదా వేయడం కాదు.. పూర్తిగా జీఎస్టీనే రద్దు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వస్త్రాలపై 5శాతం జీఎస్టీపై ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం మొండిగా అమలు చేసిందన్నారు. ప్రస్తుతం 5 నుంచి 12 శాతానికి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సింథటిక్ వస్త్రాలకు ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించి, స్వదేశీ చేనేత వస్త్రాలపై మాత్రం పెంచడం సిగ్గు చేటన్నారు. బీజేపీ చెప్పేవి స్వదేశీ మాటలు.. చేసేది విదేశీ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోకపోతే రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేనేత, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ కార్మికులు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూలు, రంగు, రసాయనాల ధరలు 40, 50 శాతం పెంచడంతో వస్త్రాల తయారీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఈ సమావేశంలో చేనేత, పవర్లూమ్ కార్మిక సంఘాల నాయకులు రావిరాల మారయ్య, రాపోలు వెంకన్న, గంజి నాగరాజు, పెండెం రాములు పాల్గొన్నారు.