Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్ధికమంత్రిని కలిసిన చేనేత ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేతపై జీరో జీఎస్టీని కోరుతూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో మంత్రిని కలిసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. చేనేతపై జీఎస్టీ ప్రభావం తీవ్రతను ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. మిల్లు వస్త్రాలనుంచి చేనేత రంగం పోటీని తట్టుకోవాలంటే సున్నా జీఎస్టీని అమలు చేయాలని కోరారు. పవర్‌లూం, చేనేత మగ్గంపై తయారైన కొన్ని చీరెలను సీతారామన్ ముందుంచారు. చేనేత వస్త్రాలకు ఉపయోగించే ముడిపదార్ధాలు, తయారైన చేనేత వస్త్రాలపై సున్నా జీఎస్టీ ప్రతిపాదనకు సానుకూలంగా మంత్రి స్పందించినట్టు తెలిపారు. టెక్స్టైల్ శాఖ మంత్రి పియూష్గోయల్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో పద్మశ్రీ గజం అంజయ్య,యర్రమాది వెంకన్న నేత, కందగట్ల బాలమణి, ప్రవీణ్ భారు, గోవింద్ గణప, కందగట్ల నర్సింహ, చిలువేరు కాశీనాద్ తదితరులు ఉన్నారు.