Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధలను విధిగా పాటిద్దాం...
- నూతన సంవత్సర వేడుకల్లో గవర్నర్ తమిళి సై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ మన పెద్దలు ఏనాడో చెప్పారని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ గుర్తు చేశారు. కోవిడ్ నేపథ్యంలో వారు చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్లూ నిజమయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ... గత రెండేండ్లుగా కరోనాతో యావత్ ప్రపంచం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 2022లోనైనా తెలంగాణ 'కరోనా ఫ్రీ...' రాష్ట్రంగా అవతరించాలని ఆమె ఆకాంక్షించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం తప్పనిసరని సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వీలుగా విధిగా సాంప్రదాయక ఆహార పదార్థాలు, పోషకాహారాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా కరోనా సోకినా తీవ్రతను తగ్గించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మొదటి డోసు టీకా ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, అధికారులను అభినందించారు. పలువురు వికలాంగులు, బధిరులు, మూగ విద్యార్థులకు ఈ సందర్భంగా ఆమె ల్యాప్‌ట్యాప్‌లను పంపిణీ చేశారు. రాజ్‌భవన్ ఉద్యోగులు, సిబ్బందితోపాటు సాధారణ ప్రజానీకం నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా రెండు పెట్టెలను అందుబాటులో ఉంచారు. తమిళి సై వాటిని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ భర్త డాక్టర్ సౌందర రాజన్, ఆమె వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారధి, సీనియర్ ఐపీఎస్ మహేశ్ భగవత్ తదితరులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.