Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
- నలుగురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం
నవ తెలంగాణ-జహీరాబాద్/తెలకపల్లి/పాల్వంచ
నూతన సంవత్సరం తొలి రోజే పలు కుటుంబాల్లో విషాదం నింపింది. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. నలుగురు తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలు సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్నాయి.
జీవనోపాధి కోసం అనంతపురం జిల్లాకు చెందిన దంపతులు బాలరాజు(28), శ్రావణి(22) కూతురు అమ్ములు (8 నెలలు) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రామ్‌నగర్‌కు పది రోజుల కిందట వచ్చి జీవనం సాగిస్తున్నారు. వారు గ్రామాలు తిరుగుతూ చిన్న పిల్లల బట్టలు విక్రయించుకుంటున్నారు. రోజూ మాదిరిగానే శనివారం కూడా భార్యాభర్తలు తమ ద్విచక్ర వాహనంపై బట్టలు విక్రయించేందుకు మిర్జాపూర్, కొత్తూరు గ్రామాలకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25), తన సహచరుడు మసూద్‌తో కలిసి సీసీ కెమెరాలు రిపేర్ చేసేందుకు న్యాలకల్ మండలం మెటల్కుంటకు జహీరాబాద్- బీదర్ రహదారిపై కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢకొీట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బాలరాజు, కారులో ప్రయాణిస్తున్న ఫరీద్ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రావణి, అమ్ములు తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఫన్ ఆసియా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. కారు నడుపుతున్న మసూద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య, రేణమ్మ (46) దంపతులతో పాటు వారి సమీప బంధువైన బాలస్వామి (43) ముగ్గురు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బంధువుల ఫంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి తెలకపల్లి మండలం రాకొండ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢకొీట్టింది. ఈ ఘటనలో రేణమ్మ అక్కడిక్కడే మృతిచెందగా తీవ్రగాయాలైన బాలస్వామి, మల్లయ్యను చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బాలస్వామి మృతిచెందాడు. ప్రస్తుతం మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు రేణమ్మ అల్లుడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జి.మాధవ రెడ్డి తెలిపారు.
ఏపీలోని జగ్గయ్యపేట నుంచి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్‌కు వస్తున్న యాష్ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. యాష్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో పాల్వంచ పట్టణంలోని అల్లూరిసెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ కూడలి వద్దకు ట్యాంకర్ రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఆటోలు, స్కూటీని తగులుకుంటూ ఇండ్లవైపు దూసుకెళ్లింది. ఇంటి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్న మహిళలపైకి ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో ముగ్గురు తప్పించుకోగా గార్లపాటి వెంకటనర్సమ్మ (45), కోటేశ్వరమ్మ(53) అక్కడికక్కడే మృతిచెందారు. ఓ ఆటో నుజ్జునుజ్జుయింది. కాగా ఓ ఇంటి గోడను ఢకొీట్టి అనంతరం కరెంటు పోల్‌ను ఢకొీని లారీ నిలిచిపోయింది. డ్రైవర్ స్వల్పగాయాలతో బయట పడగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, రోడ్డు ఇరుగ్గా ఉండటం, ఇరువైపులా ఆక్రమణకు గురికావడంతో రోడ్డు కుదించుకుపోయి ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలుపుతున్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రవీణ్ చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.