Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రా తీయకుండానే పరారైన నిర్వాహకులు
- రోడ్డుపై బాధితుల నిరసన
నవతెలంగాణ - అచ్చంపేట
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని శ్యామ్స్ ఫంక్షన్ హాలులో శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. శనివారం నిర్వహించిన లక్కీ డ్రాలో గందరగోళం నెలకొనడంతో నిర్వాహకులు పరారయ్యారు. రూ.300 చెల్లిస్తే రూ.10లక్షలు, కారు, ట్రాక్టర్ గెలవొచ్చని ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో వారిని నమ్మిన అమాయక ప్రజలు రూ.300 చొప్పున రూ.3 కోట్ల వరకు చెల్లించారు. డబ్బులు తీసుకుంటున్నారేగానీ ఎవరికీ బహుమతులు అందజేయడం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన బాధితులు లక్కీ డ్రాలో మోసం ఉందని ఆందోళన చేశారు. ఈ క్రమంలో నిర్వాహకులు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నిర్వాహకులు లక్కీ డ్రా తీయకుండానే పరారయ్యారు. బాధితులు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు.