Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో స్థానిక జిల్లాకు కాకుండా వేరే జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లా క్యాడర్‌కు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలకు అవకాశం ల్పించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లా క్యాడర్‌గా ఉన్న ఉపాధ్యాయులను ఆయా జిల్లాల నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ క్యాడర్లుగా కేటాయించారని గుర్తు చేశారు. దీనివల్ల కొంతమంది ఉపాధ్యాయులు నూతన జిల్లాల్లో స్థానికేతరులుగా మారుతున్నారనీ, దీంతో వారు ఆందోళనతో ఉన్నారని తెలిపారు. కొత్త జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలనీ, స్థానిక జిల్లాకు కాకుండా వేరే జిల్లాకు కేటాయించిన వారిని సొంత జిల్లాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లా హన్మకొండ స్థానికత ఉన్నా భూపాలపల్లికి కేటాయించిన వారికి సొంత అభ్యర్థనపై హన్మకొండ జిల్లాకు బదిలీ చేయాలని సూచించారు. ఈ పద్ధతుల ద్వారా ఉపాధ్యాయుల్లో ఏర్పడిన ఆందోళనను తొలగించవచ్చని కోరారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న బానోత్ జేత్రాం అనే ఉపాధ్యాయుడు ములుగు జిల్లాకు కేటాయించడం వల్ల ఆందోళనతో గుండెపోటు వచ్చి మరణించినట్టు మీడియాలో వచ్చిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రకారం స్థానికేతర జిల్లాకు కేటాయించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తే ఉపాధ్యాయుల్లో ఆందోళన తగ్గేదని వివరించారు. సీనియార్టీ జాబితాల్లో జరిగిన తప్పులను సవరించడంలో కొన్ని జిల్లాల అధికారులు అలసత్వం ప్రదర్శించినట్టు కనిపించిందని తెలిపారు. తప్పు జరిగిందని ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తే వాటిలోని అంశాలను వెంటనే పరిష్కరించి సంబంధిత ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు. అలాంటి పారదర్శకత అధికారుల్లో తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని ప్రభుత్వం పరిచేయాలని కోరారు. రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించడం, ప్రాతినిధ్యాలు స్వీకరించడం, అవసరమైన ఉత్తర్వులు రాతపూర్వకంగా జిల్లాలకు జారీ చేయడం సరైన పద్ధతిలో లేదని విమర్శించారు. మౌఖిక ఆదేశాల వల్ల తప్పులు ఎక్కువగా జరిగాయని తెలిపారు. కొత్త లోకల్ క్యాడర్లకు ఉపాధ్యాయుల కేటాయింపు వల్ల వారిలో ఏర్పడిన ఆందోళనను తొలగించేందుకు తగు చర్యలు తక్షణమే తీసుకోవాలని నర్సిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.