Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆత్మహత్యాయత్నం
- ధాన్యానికి నిప్పు పెట్టి, పురుగుల మందు తాగి..
- నూతన సంవత్సరం నాడే ఘోరం
నవతెలంగాణ-మంగపేట
నూతన సంవత్సరం తొలి రోజే ఆ రైతు కుటుంబంలో విషాదం నెలకొంది. నెల రోజులుగా ఆరబోసిన ధాన్యాన్ని కాంటా వేయడం లేదనీ, అప్పు ఇచ్చిన వ్యక్తుల వద్ద పరువు పోతోందన్న వేదనతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రామటెంకి సందీప్ పండించిన ధాన్యాన్ని నెల రోజుల కిందట గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబోశాడు. రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వాటి వడ్డీలు కట్టలేక తీవ్ర వేదనకు గురయ్యాడు. దాంతో శనివారం ఉదయం ధాన్యం బస్తాను గ్రామంలోని కొత్తపేట క్రాస్ రోడ్డు సెంటర్‌కు తెచ్చి జనం చూస్తుండగానే.. ధాన్యం బస్తాకు నిప్పుపెట్టి, తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వైద్యం కోసం సందీప్‌ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.