Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్ రూల్స్ అందరూ పాటించాలి
- ఎగ్జిబిషన్ ఆదాయం విద్యార్థుల చదువుకు..
- నుమాయిష్-2022ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నుమాయిష్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ ఏడాది కరోనాను పూర్తిగా జయిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని 18 విద్యాసంస్థల్లో 30 వేల మంది విద్యార్థుల చదువు కోసం వినియోగించడం మంచి నిర్ణయమని కొనియాడారు. ఇది కేవలం బిజినెస్ కాదు ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ అన్నారు. ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. నుమాయిష్ ప్రాంగణంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. హోంమంత్రి మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువ పారిశ్రామికవేత్తలు తమ వస్తువులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించి విక్రయిస్తున్నారని, దీనివల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులతో పాటు ప్రముఖ కంపెనీల వస్తువులను ఎగ్జిబిషన్లో ఉంచారన్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రభాశంకర్, వినరు కుమార్ మాట్లాడుతూ.. సందర్శకులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు రూ.30గా తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మైదానంలో 1500స్టాళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చామ న్నారు.45రోజులపాటు చిన్నారులను అలరించడాని కి 16 రకాల గేమ్స్ రైడర్లు ఉన్నాయన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మైదానంలోకి సందర్శకులను వాహనాలతో అనుమతిస్తామన్నారు. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్ర వాహనానికి రూ.100 రుసుంగా పేర్కొన్నారు. వాహనదా రులు మైదానమంతటా తిరిగి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.