Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీల పెంపునకు అదే కారణం
- ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు
- మరో ప్రజాపోరాటమే శరణ్యం
- ఎస్వీకే వెబినార్‌లో విద్యుత్‌రంగ నిపుణులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యుత్‌రంగ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలతో చేసుకుంటున్న కొనుగోళ్ల ఒప్పందాల్లోనే అనేక మతలబులు ఉన్నాయని ఆక్షేపించారు. విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం కాకముందే డిస్కంలు ఒప్పందాలు చేసుకుంటున్నాయనీ, అవి పూర్తయ్యే సమయంలో విద్యుత్ నియంత్రణ మండళ్ల (ఈఆర్సీ) ముందు ప్రతిపాదనలు పెడుతున్నారని విమర్శించారు. ఒప్పందాలు జరిగిపోయినందున ఆ విద్యుత్ వినియోగంపై సమగ్ర చర్చ లేకుండానే దానికి ఆమోదాలు లభిస్తున్నాయని తెలిపారు. ఫలితంగా డిస్కంలపై ఆర్థిక భారం పడి, చార్జీల పెంపు పేరుతో ప్రజల నుంచే వసూలు చేస్తున్నారని విశ్లేషించారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో ''విద్యుత్ చార్జీలు పెంచడమే మార్గమా?'' అంశంపై వెబినార్ నిర్వహించారు. విద్యుత్‌రంగ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎమ్ వేణుగోపాలరావు, ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సభ్యులు ఎన్ శ్రీకుమార్ ప్రధాన వక్తలుగా విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదనలపై మాట్లాడారు. గడచిన మూడేండ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో పీక్‌లోడ్, బేస్‌లోడ్ నిర్ణయించడంలో లోపం జరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ప్రకారం విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదని విశ్లేషించారు. విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.7 వేల కోట్ల భారాలు మోపేలా డిస్కంలు ప్రతిపాదనలు చేశాయనీ, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి సాహసాన్ని ప్రభుత్వాలు చేయలేదన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు స్వతంత్రత లేదనీ, వాటిని ప్రభుత్వమే నడిపిస్తున్నదని చెప్పారు. 2022-23 టారిఫ్ ప్రతిపాదనల్లో రూ.5,170 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందీ అంటే, మిగిలింది వినియోగదారులనుంచి వసూలు చేసుకొమ్మనమని చెప్పడమేనని స్పష్టంచేశారు. ఈ భారాలకు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యుత్‌రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రప్రభుత్వ విధానాలు ఉంటున్నాయనీ, వాటిని మార్చకుండా ప్రజలపై భారాలను తప్పించలేమని అన్నారు. గృహ వినియోగదారులందరిపై యూనిట్‌కు 50 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించారనీ, ఇది సరికాదన్నారు. దీనిలోనూ టెలిస్కోపిక్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కరెంటు చార్జీలే కాదనీ, వినియోగదారులపై అదనంగా డిమాండ్ చార్జి, కస్టమర్ చార్జి, మినిమం చార్జిల వంటివి ఉంటాయనీ, అవన్నీ కలిపితే 70 శాతం అధికంగా బిల్లులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారానికి కారణం డిస్కంల ప్లానింగ్‌లో వైఫల్యమేనన్నారు. చాలాకాలం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి చైర్మెన్, సభ్యుల్ని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ శాఖల బకాయిలు భారీగా ఉన్నాయనీ, వాటికి ప్రీపెయిడ్ మీటర్లు పరిష్కారం కాదన్నారు. ప్రజా ఆస్తుల బిల్లుల్ని సకాలంలో చెల్లించాలని చెప్పారు. 2018-19 నుంచి రూ.26,690 కోట్లు రెవెన్యూలోటు చూపిస్తున్నారనీ, వాటిని ట్రూఅప్‌గా డిస్కంలు అడుగుతున్నాయని తెలిపారు. మూడేండ్ల ఏఆర్ఆర్లను ఈఆర్సీ తిరస్కరించిందనీ, 2022-23 చార్జీల టారిఫ్ ప్రతిపాదనలు ఏఆర్ఆర్లతో పాటే ఇవ్వలేదన్నారు. విద్యుత్ పంపిణీలకు స్వతంత్రత లేదనీ, అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తున్నదనీ, చార్జీల పెంపునకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీ పెరిగితే చార్జీల భారం ప్రజలపై తగ్గుతుందన్నారు. ఈఆర్సీ ఉనికిలో లేని పదినెలల కాలంలో కూడా డిస్కంలు పాత టారిఫ్ చార్జీలనే వసూలు చేశాయనీ, ఇది చట్టవిరుద్ధమని స్పష్టంచేశారు. డిస్కంల బకాయిలు పేరుకు పోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రం విధానాల కారణంగా నష్టాలు పెరుగుతున్నాయని డిస్కంలు 4 కారణాలు చెప్పాయనీ, అవి కాక ఇంకా అనేకం ఉన్నాయన్నారు. సోలార్, విండ్ పవర్ తప్పనిసరిగా కొనాలని షరతు పెట్టారనీ, దీనివల్ల రేటుతో సంబంధం లేకుండా డిస్కంలు కరెంటు కొనాల్సి వస్తున్నదని తెలిపారు. అధికధరకు కొనుగోళ్లుచేసి, చౌకైన థర్మల్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తుందని విశ్లేషించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు వేలకోట్లు రుణమాఫీ చేస్తున్నదనీ, జెన్కో, డిస్కంల బకాయిలు ఎందుకు మాపీ చేయరని ప్రశ్నించారు. బొగ్గు కొరత కేంద్ర వైఫల్యమే. స్థానిక బొగ్గును ఇక్కడి థర్మల్ కేంద్రాలకు వినియోగించుకుంటామని లేఖరాస్తే, సింగరేణి కాలరీస్‌కు ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాకులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బొగ్గు ఉత్పత్తి కన్నా, రవాణా చార్జీలే అధికమవుతాయన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా బయట అమ్ముకోలేమని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సర్కారుకు తానతందానా అంటున్నాయనీ, కమిషన్ ప్రజల పక్షాన నిలబడి, ఆర్డర్లు ఇవ్వాలని చెప్పారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.