Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటోన్మెంట్లో 21రోడ్లను మూసేశారు
- రక్షణ శాఖ భూములపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదు
- షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సంలో మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ నగరాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఉత్తర్‌ప్రదేశ్‌లో రక్షణశాఖ భూములను అభివృద్ధి కోసం ఇచ్చారు. కానీ తెలంగాణలో ఏడేండ్లుగా కోరుతున్నా ఇవ్వడం లేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా మూసేశారు. ఈ విషయం ఏడేండ్ల్ల నుంచి నలుగురు రక్షణశాఖ మంత్రులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి రోడ్లను ఓపెన్ చేయించాలి. ఎస్ఆర్డీపీ ద్వారా కంటోన్మెంట్ ప్రాంతాల్లో చేపట్టే రోడ్లకు రక్షణ శాఖ భూములు అవసరం. ప్యాట్ని నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశాం. రక్షణ శాఖ భూములు కేటాయించాలి' అని పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.333.55 కోట్లతో చేపట్టిన హైదరాబాద్ షేక్‌పేట్ అతి పెద్ద ఫ్లైఓవర్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి శనివారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మానస పుత్రిక ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, ఆర్ఓబీలు తదితర 24 పనులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో చిన్న వయస్సు గల, భౌగోళికంగా 11వ రాష్ట్రం, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పథకాలతోపాటుగా హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా 132 లింక్ మిస్సింగ్ రోడ్లను చేపట్టడం జరిగిందన్నారు. హైదరాబాద్ చారిత్రాత్మక నేపథ్యాన్ని భవిష్యత్తు తరాల వారికి అందించేలా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కృషి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా వారసత్వ సంపద కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూనిసెఫ్ ద్వారా గుర్తింపు తేవాలని కోరారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు భూసేకరణ చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంజూరైన జాతీయ రహదారుల పనులకు కేంద్ర మంత్రి గడ్కరీతో త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు 25 ఏకరాల భూసేకరణ చేయాలని ఇటీవలనే ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందని, ఎంత తొందరగా భూసేకరణ ఇస్తే అంత తొందరగా ప్రారంభిస్తామన్నారు. రీజనల్ రింగు రోడ్డు భూసేకరణ కూడా తొందరగా పూర్తి చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 7 టూమ్స్ అభివృద్ధికి స్వదేశీ దర్శన్ పథకం కింద నిధులు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికేపూడి గాంధీ, ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీధర్, సీఈ దేవానంద్, ఎస్ఈ వెంకటరమణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.