Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కేసులు....
- నాలుగు రోజుల్లో అదనంగా 200 మందికి కరోనా
- థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటామంటున్న సర్కార్
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యనిపుణలు
- ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: రాష్ట్రానికి కేంద్రం లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికల నేపథ్యంలో... కట్టడి కోసం సర్కారు చర్యలు అరకొరగానే ఉండగా.. మరోవైపు ప్రజలూ ఎక్కడా కోవిడ్ నిబంధనలను పాటించటంలేదు. దీంతో మహమ్మారికి అడ్డుకట్ట పడలేదని అర్థమవుతున్నది. ముప్పు ఉన్న దేశాలు, ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో రెండు శాతం మందికి టెస్టులు చేశారు. మరోవైపు జిల్లాల్లోనూ సమూహాలు, గుమిగూడే ప్రాంతాలు పాఠశాలలు తదితర ప్రదేశాల నుంచి పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వెరసి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అలాగే తగ్గుతున్న రికవరీలూ తగ్గుతున్నాయి.గత నాలుగు రోజుల నుంచి కొత్త కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... ప్రస్తుత పరిస్థితిని థర్డ్ వేవ్ ప్రారంభంగా భావించవచ్చని ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్త వహించాలనీ, కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గత ఐదు నెలలుగా కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో రోజూవారీ కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటూ వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల్లో తగ్గుదల చోటు చేసుకోవడంతో ఒక దశలో కరోనా నుంచి బయటపడతామనే ఆశావహ వాతావరణ నెలకొంది. డిసెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 3,625 యాక్టివ్ కేసులున్నాయి. అప్పట్నుంటి డిసెంబర్ 27 వరకు ప్రతి రోజు కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు 208 తగ్గి వాటి సంఖ్య 3,417కు చేరుకుంది. డిసెంబర్ 28 నుంచి ఈ పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. 28న కొత్త కేసులు 228 రాగా కోలుకున్న వారి సంఖ్య 185కు పరిమితమయింది. 29న 235 మంది కొత్తగా వ్యాధి బారిన పడితే రికవరీలు 204 మాత్రమే. 30న 280కి 74కు తక్కువగా 206 మంది బయటపడ్డారు. శుక్రవారంనాడు ఏకంగా ఐదు నెలల రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 311 కేసులు రాగా 89 తక్కువగా 222 రికవరీలు ఉన్నాయి. దీంతో కేవలం నాలుగు రోజుల్లో 191 యాక్టివ్ కేసులు పెరిగి 3,650కి చేరాయి. ఇదే పరిస్థితి ముందు కూడా కొనసాగే అవకాశముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
థర్డ్ వేవ్ నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు తగినట్టు ఆంక్షలు విధించాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ టెస్టులను వీలైనంత మేరకు ఎక్కువగా చేయాలని సూచించింది. సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్‌తో దేశంలోని కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు మరి కొన్ని వారాలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పదేండ్లలోపు, 60 ఏండ్లపైబడిన వారు తప్పనిసరైతే తప్ప బయటికి వెళ్లవద్దనీ, కరోనా సమయంలో అత్యధిక కేసులు 20 ఏండ్ల నుంచి 50 ఏండ్లలోపు వారికే వచ్చాయని గుర్తుచేసింది. వారంతా బయటికి వెళ్లే సమంయలో జాగ్రత్తలు తీసుకోవాలనీ, పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి.
ప్రయాణం చేయొద్దు.....
హైపర్ టెన్షన్, డయాబెటిక్, కార్డియాక్ రుగ్మత, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వైద్యం కోసం తప్ప ఇతర ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆరోగ్యశాఖ సూచించింది.
సిద్ధంగా ఉండండి...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంబంధిత కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనీ, దాన్ని ఎదుర్కొనేందుకు తగిన రీతిలో సిద్దపడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. గత కొన్ని వారాలుగా యూరోప్, అమెరికాలో కరోనా కేసులకు సంబంధించి చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తున్నదనీ, అదే విధంగా భారత్‌లో 70 రోజుల్లోనే అత్యధికంగా డిసెంబర్ 31న 16,764 కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. అదనపు ఐసోలేషన్ బెడ్లు, క్షేత్రస్థాయిలో ఆస్పత్రులు, ఐసీయూ బెడ్లు, చిన్నారులకు ప్రత్యేక కేంద్రాలు, అందుబాటులో ఆక్సిజన్, అంబులెన్సులు, మందులు, రోగ నిర్ధారణ కేంద్రాలతో పాటు మానవ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. అయితే గత వేవ్‌లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో పెరిగే కేసుల్లో ఎక్కువగా హౌమ్ ఐసోలేషన్ లో ఉండే పరిస్థితే ఉండొచ్చని అంచనా వేశారు. ఆ మేరకు ఇండ్లలో ఉండే వారిని పర్యవేక్షించే వ్యవస్థను పటిష్టం చేయాలనీ, అవసరమైతే ఆస్పత్రులకు తరలించే అంబులెన్సులను వారికి అవసరమైన పరికరాలతో తీర్చిదిద్దాలని సూచించారు.
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే ప్రతి వ్యక్తి తనే కాల్ చేసి అంబులెన్స్‌ను పిలుపించుకుని ఆస్పత్రిలో పడక సౌకర్యం పొందేలా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కాల్ సెంటర్లు, డాష్ బోర్డులు, పోర్టల్ ద్వారా పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పిల్లలలకు సంబంధించిన పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.