Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే రూ.172 కోట్ల మద్యం తాగేశారు
- డిసెంబర్ నెలలో రూ.3,459 కోట్ల అమ్మకాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
న్యూఇయర్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి కిక్కిచ్చే ఆదాయాన్ని తెచ్పిపెట్టింది. ఒమిక్రాన్ ప్రమాద సంకేతాలున్నా.. కొత్త ఏడాదికి రాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆ ఒక్కరోజే మందుబాబు లు రూ.172 కోట్ల మద్యం తాగేశారు. 1.76లక్షల కేసుల లిక్కర్, 1.66లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78కోట్లు, హైదరాబాద్లో రూ.23.13కోట్ల మద్యం విక్రయా లు జరిగాయి. 2021 డిసెంబరులో రికార్డు స్థాయిలో రూ.3,459కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. డిసెంబరులో 40.48లక్షల కేసుల లిక్కర్, 34లక్షలకుపైగా కేసుల బీర్లు అమ్ముడుబోయాయి. మొత్తంగా తెలంగాణలో 2021లో 30,222కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి.కాగా, న్యూఇయర్ వేడుకలకు మద్యం కొరత రావచ్చని భావించిన మందుబాబులు వారం రోజుల ముందే అప్రమత్తమయ్యారు. డిసెంబరు 27న 202.42 కోట్లు, 28న 155.48 కోట్లు, 29న రూ.149.53, 30న రూ.246.56 కోట్లు, 31న రూ.172 కోట్ల అమ్మకాలు సాగాయి. 2020లో రూ.25,601.39 కోట్ల అమ్మకాలు జరగ్గా, 2021లో గత శుక్రవారం సాయంత్రానికే రూ.30,196 కోట్ల మేర నమోదయ్యాయి. మొత్తంగా ఏడాదంతా 3,68,68,975 కేసుల లిక్కర్, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
నిబంధనలు సర్కారువే..
ఆదాయం ప్రభుత్వానికే..
న్యూఇయర్ వేడుకల సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వం పదేపదే చెప్పింది. మరో పక్క పబ్బులకు, క్లబ్బులకు విచ్చలవిడిగా అనుమతుల్చింది. ఇంకో పక్క డ్రంకెన్ డ్రైవ్ వసూళ్లపై కేంద్రీకరణ పెరిగింది. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించటంతోనే సర్కార్ కోవిడ్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.