Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొరెడ్డి అయోధ్యరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోనే విద్యుత్ భారంగా మారిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి చెప్పారు. ఏడేండ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదనే సాకుతో భారీగా కరెంట్ చార్జీలు పెంచడానికి సీఎం కేసీఆర్ సిద్ధమమవుతున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల రూ 7వేల కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఐదు వేల కోట్ల రూపాయలు మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజల నుంచే వసూలు చేయనున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వాకం వల్ల విద్యుత్ సంస్థలపై రూ 40వేల కోట్ల అప్పుల భారం పడిందన్నారు. దీనికి కారణం ఏంటో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకుంటామనీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ముందు వాదనలు వినిపిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా జీవో 317 విడుదల చేసిందనీ, ఆ జీవోను వెంటనే ఆపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. ఆ జీవోతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సమస్యలు వస్తున్నాయన్నారు. నాన్ ట్రైబ్స్ ఉద్యోగులను రానివ్వమని ఆదిలాబాద్లో ఉద్యమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.