Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం అభినందన సభలో డాక్టర్ అక్కెనపల్లి పున్నయ్య
నవతెలంగాణ -నల్లగొండ
లక్ష్యాన్ని సాధించడంలో శ్రమ, సమయపాలన ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆర్థిక విశ్లేషకులు, తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగం డీన్ డాక్టర్ అక్కెనపల్లి పున్నయ్య అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎకనామిక్ ఫోరం, ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ ఎకనామిక్స్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ధిష్టమైన లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి పని చేయడంతో పాటు సమయపాలన పాటిస్తే లక్ష్య సాధన సులభమవుతుందని తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా జీవన శైలిని రూపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, కార్యాచరణ, సమయపాలన ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సేవలను కొనియాడారు. ఈ సంస్థ అతి తక్కువ సమయంలోనే ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం, పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడానికి గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే కాలంలో విద్యార్థులు ఉద్యమంతో పాటు సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా పేద ప్రజలకు అందుబాటులో ట్రస్టు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలకు కరోనా కాలంలో ఐసోలేషన్ కేంద్రం, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందులో భాగంగానే కరాటే, కంప్యూటర్ శిక్షణ, కుట్టు మిషన్, డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్ వంటి కోర్సులను వేసవికాలంలో నిర్వహించామని తెలిపారు. గ్రూప్-2లో 13 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారనీ, ప్రస్తుతం ఎకనామిక్స్ ఎంట్రెన్స్‌లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో మొదటి ర్యాంకుతో పాటు 40 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ చక్రహరి సత్యనారాయణరాజు, ఎంవి గోనారెడ్డి, డి.అంజయ్య, మందడి నర్సిరెడ్డి, డాక్టర్ బెల్లి యాదయ్య, గణేష్, భాస్కర్‌రెడ్డి, సుల్తానా, ట్రస్టు కార్యనిర్వాహణ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి, కొండల్, కవిత, యాదగిరి పాల్గొన్నారు.