Authorization
Fri April 11, 2025 04:17:55 am
- ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలి
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను రద్దు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలని కోరింది. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ అధ్యక్షులు చిలగాని సంపత్‌కుమారస్వామి మాట్లాడుతూ ఆ జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై శాశ్వతంగా వారి స్థానికతను కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మూలమైన స్థానికతను ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలనీ, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. 317 జీవో ప్రకారం స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్థానిక జిల్లా/జోన్/మల్టీ జోన్లో కేటాయించాలని సూచించారు. గతంలో 610 జీవో ద్వారా స్థానికత ఆధారంగానే ఉద్యోగ, ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేశారని గుర్తు చేశారు. ఇది ఉద్యోగుల సమస్య కాదనీ, భవిష్యత్తులో ఖాళీపోస్టులుండే అవకాశం లేదని చెప్పారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు జి నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి, నాయకులు జి ఆనంద్ యాదవ్, భోగ శ్రీనివాస్, బొడ్డు ప్రసాద్, యాకూబ్‌పాషా, కె జయలక్ష్మి, తాళ్ల శ్రీనివాస్, దోనేపూడి చక్రపాణి, ఎం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.