Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను సవరించాలనీ, బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ సోమ, మంగళవారాల్లో ప్రజాప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఈ మేరకు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు, జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావు, కొమ్ము రమేశ్, ఎన్ యాదగిరి, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, బి కొండయ్య, ఎస్ మహేష్, సుధాకర్ రెడ్డి, జి విజయసాగర్, హరికిషన్, శ్రీనునాయక్, ఎ గంగాధర్, మసూద్ అహ్మద్, భిక్షపతి, విజయకుమార్, కుర్సం రామారావు, మాళోత్ రామారావు, తాహెర్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రకాల అప్పీళ్లను పరిష్కారం చేసిన తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పోస్టింగ్లు అడ్హక్గా ఇచ్చి సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. సోమ, మంగళవారాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లో కలిసి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించామని వివరించారు. యూఎస్పీసీ భాగస్వామ్య సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బాధిత ఉపాధ్యాయులతో కలిసి వెళ్లి సంబంధిత ప్రజాప్రతినిధులకు సమస్యలను వివరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరతామని పేర్కొన్నారు.