Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావాలంటీర్ల ఊసెత్తని ప్రభుత్వం
- సమీపిస్తున్న పరీక్షలు
- దృష్టి సారించని యంత్రాంగం
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
కరోనా కారణంగా విద్యార్థులకు బోధన వేదనగా మారింది. ఆశించిన స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం, ఖాళీ స్థానాలు భర్తీ చేయకపోవడం, వారి స్థానాల్లో విద్యా వాలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థులతో పాటు విద్యా వాలంటీర్లు సంకటస్థితిలో పడ్డారు. మరో రెండు నెలల్లో పరీక్షలు సమీపిస్తుండటంతో నేటికీ సర్కారు గానీ, అధికారులు గానీ ఖాళీ పోస్టుల భర్తీపై నోరు మెదపకపోవడం గమనార్హం. సిలబస్ పూర్తి కాకపోవడం, చాలీచాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు న్యాయం చేయకపోవడం విద్యార్థులను మరింత కృంగదీస్తోంది. విద్యా వాలంటీర్లను నియమిస్తే కాస్త ఊరటగా ఉండేదని ఉపాధ్యాయులూ చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు కలిపి 22,729 పాఠశాలలు న్నాయి. వీటిలో 6,63,270 మంది విద్యార్థులున్నారు. అందులో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 1834 పాఠశాలలుండగా 2,63,680 మంది విద్యార్థులున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1967 పాఠశాలలుండగా 2,74,590 మంది, వనపర్తి జిల్లాలో 694పాఠశాలల్లో 58వేల మంది విద్యార్థులున్నారు. గద్వాల జిల్లాలో 864 పాఠశాలల్లో 67వేల మంది విద్యార్థులున్నారు. వీరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,535 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా, 13వేల మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. గతేడాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా వాలంటీర్లను నియమించి నెలకు రూ.10వేల చొప్పున వేతనాలిస్తూ విద్యా బోధన చేయించారు. ప్రభుత్వం వారు భారమని భావించి కరోనాకు ముందే విద్యా వాలంటీర్లను తొలగించి ఉన్న ఉపాధ్యాయులకు అదనపు భారాన్ని మోపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆంగ్లం, లెక్కలు బోధించేవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వీటి ఫలితంగా విద్యార్థులు వీటిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఖాళీ పోస్టులతో పాటు ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారిని విద్యా వాలంటీర్లుగా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాటి ఊసెత్తకపోవడం దారుణమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
పాఠశాలలు ప్రారంభించి విద్యా వాలంటీర్లను తీసుకోవాలి
విద్యారంగంపై పాలకుల నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేయలేదు. దాంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోయింది. ప్రభుత్వం వెంటనే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి.
- జంగయ్య, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు