Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేజారిపోయిన తర్వాత పెరిగిన వైనం
- ఈ ఏడూ తీవ్రంగా దిగజారిన దిగుబడి
- గత్యంతరం లేక తక్కువకే విక్రయించిన రైతులు
- పత్తి బండ్లు రాక బోసిపోతున్న మార్కెట్
నవతెలంగాణ-ఆదిలాబాద్
ప్రాంతీయ ప్రతినిధి/ తలమడుగు
ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూత, కాత దశలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా కుంగదీశాయి. పూత, కాత రాలిపోవడంతో పాటు గులాబీ పురుగు బెడదతో పత్తి దిగుబడి తీవ్రంగా పడిపోయింది. కనీసం ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా రావాల్సిన పంట దిగుబడి కనీసం 5 క్వింటాళ్లు కూడా రాలేకపోయింది. ఒక్కో ఎకరానికి కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏట 80 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా ఉండగా.. విపత్తుల కారణంగా సుమారు 20 లక్షలకే పరిమితమైంది. మార్కెట్లో ధర బాగున్నా దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అనేక మంది రైతులకు పంట పెట్టుబడి కూడా రాలేదు. మరోపక్క పంట నష్ట పరిహారం కూడా రాని పరిస్థితి ఉంది. పంట వేసేందుకు తీసుకొచ్చిన అప్పులు చెల్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
ధర పెరిగినా ఫలితం శూన్యం..
మార్కెట్లో తొలుత పత్తి ధర క్వింటాల్‌కు రూ.6500 నుంచి రూ.8500 వరకు ఉండేది. కానీ పత్తి మార్కెట్‌కు వచ్చే సమయంలో క్వింటాల్‌కు రూ.6500 నుంచి రూ.7వేల వరకు పలికింది. కానీ మహారాష్ట్రలో రూ.8 వేల వరకు ఉండటంతో అనేక మంది జిల్లా రైతులు అక్కడికెళ్లి విక్రయించారు. ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి విక్రయాలు చాలా తక్కువగా జరిగాయి. కిందటేడాది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు 12 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా ఈ ఏడాది కేవలం 4.60 లక్షల క్వింటాళ్లకే పరిమితమైంది. మరోపక్క ధర పెరుగుతుందనే ఆశతో అనేక మంది రైతులు వారం రోజుల కిందట వరకు పత్తిని ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. కష్టమైనా భరించి పత్తిని అలాగే ఉంచారు. కానీ ధర పెరిగే అవకాశం లేకపోవడంతో రైతులంతా రూ.7వేల నుంచి రూ.8వేల మధ్య ధర ఉన్నప్పుడు విక్రయిం చారు. తాజాగా వారం రోజుల నుంచి జిల్లాలోని భైంసాలో రూ.9వేలు, ఆదిలాబాద్‌లో రూ.8860 వరకు ధర పెరిగింది. పత్తినంతా విక్రయించిన తర్వా త ధర పెరగడంతో రైతులంతా నిరాశకు గురవుతు న్నారు. పత్తి లేని సమయంలో ధర పెంచితే ఏం ప్రయోజనమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా రోజులు నిల్వ ఉంచి విక్రయించాను
ఈ ఏడాది 65 ఎకరాల్లో పత్తి పంట వేశాను. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ వాతావరణం అనుకూలించక విపత్తుల కారణంగా కేవలం ఎకరానికి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. తొలుత కొన్ని క్వింటాళ్ల పత్తిని రూ.7700 నుంచి రూ.8వేల వరకు ధర పలికినప్పుడు విక్రయించాను. మళ్లీ ధర పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా వరకు పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచాను. కానీ ధర పెరగలేదు. దాంతో రూ.8 వేల చొప్పున 15 రోజుల కిందట విక్రయించాను. కానీ ప్రస్తుతం క్వింటాల్ రూ.9వేలు పలుకుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. రైతుల వద్ద పత్తి లేని సమయంలో ధర పెరిగినా వృథానే కదా..
- సుదర్శన్ రెడ్డి, రైతు, రుయ్యాడి