Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలి
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వివాదాస్పదంగా మారినందున తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అవసరమైన సవరణలు చేపట్టాలనీ, నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడంతో పలువురు స్థానికేతర జిల్లాలకు బలవంతంగా కేటాయించారని అన్నారు. వారు పుట్టి, పెరిగిన ఊరును, అయిన వాళ్లను వదిలి పెట్టి ఇతర జిల్లాలకు శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి రావడంతో తీవ్రంగా కలత చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో సీనియార్టీ జాబితాలు లోపభూయిష్టంగా తయారు చేశారని విమర్శించారు. ఉపాధ్యాయుల అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. కొన్ని జిల్లాల్లో జిల్లాల కేటాయింపు, పాఠశాలల కేటాయింపు ప్రక్రియ పారదర్శకం గా జరగలేదని విమర్శించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అన్నారు. స్వచ్చందంగా పోరాటాల్లోకి వస్తున్నారని వివరించారు. ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లోకల్ క్యాడర్లో ఉపాధ్యాయుల కేటాయింపు సక్రమంగా జరగాలంటే తమ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి కోరారు.
టీఎస్‌యూటీఎఫ్ ప్రతిపాదనలు :
- ఉద్యోగుల కేటాయింపులో సీనియార్టీతోపాటు స్థానికతనూ పరిగణనలోకి తీసుకోవాలి. నూతన జిల్లాల్లో 80 శాతం పోస్టులు ఆ జిల్లా స్థానికులకు కేటాయించాలి. అందుకనుగుణంగా 2021, డిసెంబర్ 6న జీఏడీ జారీ చేసిన 317 జీవోను సవరించాలి.
- వితంతువులు, ఒంటరి మహిళలను స్పెషల్ కేటగిరీలో చేర్చి నష్టపోయిన వారికి న్యాయం చేయాలి.
- సీనియార్టీ జాబితాలపై ఉపాధ్యాయుల అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి పరిష్కరించాలి.
- జిల్లాల కేటాయింపులో జరిగిన తప్పిదాలను సవరించి నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
- జిల్లాల ఎంపికలో నష్టపోయిన ఉపాధ్యాయులకు పరస్పర అంగీకారంతో (మ్యూచువల్) బదిలీలకు అనుమతినివ్వాలి.
- సీనియార్టీ జాబితాల్లో అవకతవకలకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
- స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించి తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
- ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల కేటాయింపులో కొన్ని జిల్లాల్లో జరిగిన అసంబద్దతలను సవరించాలి.
- జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు తాత్కాలిక(అడ్‌హక్) పద్ధతిలో పాఠశాలలు కేటాయించి సాధారణ బదిలీల్లో స్టేషన్ సీనియార్టీ, సర్వీసు సీనియార్టీకి పాయింట్లు కేటాయించి బదిలీకి అవకాశం కల్పించాలి.
- వేర్వేరు జిల్లాలకు కేటాయించిన భార్యాభర్తలను 317 జీవోలోని పేరా 23 ప్రకారం వెంటనే ఒకేజిల్లాకు తిరిగి కేటాయించాలి.
- నూతన జిల్లాలకు కేటాయింపు ప్రక్రియ ముగిసిన వెంటనే సాధారణ బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి.
- మోడల్ స్కూళ్లు, అన్ని సొసైటీల గురుకుల విద్యాసంస్థల్లో లోకల్ క్యాడర్ విభజన జరిపి సాధారణ బదిలీలకు, పదోన్నతులకు అనుమతించాలి.