Authorization
Sat April 12, 2025 11:36:22 am
- మంజీరా మనుగడ ప్రశ్నార్థకమే..!
- భూగర్భ జలాలు, జీవరాశులపై ప్రభావం...నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు అధ్యయనం
- మూడేండ్లలో పూర్తి నివేదిక
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మంజీరా నదిలో దశాబ్దాలుగా చేపడుతున్న ఇసుక తవ్వకాల నేపథ్యంలో.. నదీ ప్రవాహం, జీవరాశులపై ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న అంశంపై అధ్యయనం ప్రారంభమయ్యింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు, తెలంగాణ భూగర్భ జలశాఖ, నేషనల్ రీమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ బెల్గాం సంయుక్తంగా ఈ అధ్యయనం చేపడుతున్నాయి. పదిహేనేండ్ల నుంచి మంజీరా నది స్థితిగతులు ఏంటి? మరో పదిహేనేండ్ల పాటు నది భవిష్యత్తు ఏమిటన్న ప్రధాన అంశంపై ఈ అధ్యయనం సాగనున్నది. మొత్తం మూడేండ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్(కామారెడ్డి జిల్లా) నుంచి తడ్కోల్ వరకు ఈ బృందం అధ్యయనం చేయనుంది.
గోదావరి ఉపనదుల్లో మంజీరా నది ఒకటి. ఈ నది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రవహించి నైరుతి దిక్కు నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తోంది. మంజీరా నది పరివాహక ప్రాంతమైన బీర్కూర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఐదు క్వారీలకు అనుమతి ఇచ్చింది. ఈ క్వారీల నుంచి ఇసుకను తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటకకు నిత్యం వందలాది లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. బీర్కూర్ క్వారీతో పాటు నది పరివాహక ప్రాంతాలైన బిచ్కుంద, బీర్కూర్, బోధన్ మండలాల్లోని హస్గుల్, పుల్కల్, గుండెనమ్లి, వాజీద్నగర్, సిర్పూర్, పోతంగల్, హంగర్గ, సాలూరా, మందర్నా, సిద్దాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. ఈ తవ్వకాలు కొన్నేండ్లుగా కొనసాగుతున్నాయి. అధికారికంగా ఎంత ఇసుక తరలిస్తున్నారో అందుకు రెండింతల నుంచి మూడింతల వరకు అక్రమ ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. మంజీరాలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో స్థానికంగా భూగర్భ జలాలు ప్రభావితమయ్యాయా? ఆ ప్రభావం వ్యవసాయ రంగంపై ఎలా పడుతుంది? అనే అంశాలపై అధ్యయనం చేపట్టనున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో మళ్లీ అంతే మొత్తంలో ఇసుక పై ప్రాంతం నుంచి వస్తుందా? గతంతో పోలిస్తే ఇసుక పరిణామం (థిక్నెస్) తగ్గిందా? అంతే ఉందా? నదికి వరద ప్రవాహం ఎలా ఉంది? వలస పక్షులు వస్తున్నాయా? లేక తవ్వకాలతో మంజీరాకు రావడం ఆగిందా? అని బృందం విశ్లేషించనుంది. ఇక ఇసుకను ఇష్టారీతిన తవ్వుతున్న నేపథ్యంలో భౌతికంగా నది ప్రవాహంలోనూ మార్పులు వచ్చాయా? అని అధ్యయనం చేయనున్నారు. నది స్థితిగతులపై అధ్యయనం నిర్ధిష్టంగా జరిపేందుకు సాంకేతిక సాయం కూడా తీసుకుంటున్నారు. ఇందుకు శాటిలైట్ ఫొటోలను సమీకరించుకుంటున్నారు. ప్రతి ఐదు సంవత్సరాల చొప్పున 15 సంవత్సరాల నది ప్రవాహ శాటిలైట్ ఫోటోలను పరిశీలించనున్నారు. ఈ సాంకేతిక సాయం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (బెల్గాం) అందించనుంది. మూడేండ్ల పాటు సాగనున్న ఈ అధ్యయనానికి సంబంధించి ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకొకసారి నది పరివాహక ప్రాంతాల్లో ఈ బృందం పరిశీలన జరపనుంది. మొదటి విడతగా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బృందం పర్యటించింది. వ్యవసాయ బోరుల్లో నీటిమట్టం, పంట పొలాలను పరిశీలించింది. మూడేండ్లలో నివేదికను రూపొందించనున్నారు. ఓ నదిపై ఈ విధమైన అధ్యయనం చేయడం దేశంలోనే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో కేరళలో ఈ తరహా అధ్యయనం జరిగినప్పటికీ.. అది సముద్ర ఇసుక, మంచినీటి ఇసుక మధ్య వ్యత్యాసం పెరిగిందా అన్న అంశంపై జరిగిందని చెబుతున్నారు. ఈ బృందంలో ఎన్ఆర్ఎస్ఎ శాస్త్రవేత్తలు ఐసీ దాస్, భూగర్భ జలశాఖ డీడీ రాకేష్చంద్ర, ఏడీ సతీష్యాదవ్, ఎన్ఐహెచ్ బెల్గాం శాస్త్రవేత్త అభిలాష్ తదితరులున్నారు.