Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేక్ న్యూసే కాదు..ఫేక్ వ్యూస్ కూడా ప్రమాదమే : అరుణ్‌సాగర్ పురస్కారాల అందజేతలో కె.శ్రీనివాస్
- ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వర్రావు, కవి ప్రసాదమూర్తికి పురస్కారాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసత్య వార్తలు, భావజాల వ్యాప్తి మీద సత్యపోరాటం చేయాల్సిన ఆవశ్యకత నెలకొందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ నొక్కి చెప్పారు. వాటిని తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ భావాలకు పదును పెట్టాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఫేక్న్యూసే కాదు..ఫేక్ వ్యూస్తోనూ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాల అందజేత కార్యక్రమం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగింది. అరుణ్‌సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, అరుణ్‌సాగర్ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని కవి ప్రసాదమూర్తికి అందజేశారు. వారికి మెమోంటోలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెగా నియమితులైన జూలూరీ గౌరీశంకర్, కేంద్ర సాహిత్య అవార్డు పొందిన కవి గోరటి వెంకన్నను సత్కరించారు. అంతకుముందు స్మారకోపన్యాసాన్ని కె.శ్రీనివాస్ చేశారు. మీడియా మొత్తం సత్యం, అసత్యం చుట్టే తిరుగుతుందనీ, ఆ రెండు అంశాలనూ ఎంత చాకచక్యంగా, ఎంత సమర్ధవంతంగా ప్రచారంలో పెడుతాయనే దానిని బట్టే మీడియా విలువలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. సత్యం కోసం తపించే జర్నలిస్టు మంచి చెడ్డలనూ బేరీజు వేసుకుని తన పనిపై విమర్శ చేసుకుంటూ ముందుకు పోయే తత్వం కలిగి ఉంటాడనీ, అరుణ్‌సాగర్ ఆ కోవకు చెందిన వ్యక్తి అని కొనియాడారు. నాలుగైదేండ్ల నుంచి సత్యాంతర కాలం అనే భావన మొదలైందన్నారు. ముస్లిం జనాభా పెరగడానికి ఫలానా కారణం అనే అభిప్రాయాన్ని ప్రజల మెదళ్లోకి జొప్పించాక ఎన్ని గణాంకాలు చూపించినా వాటిని నమ్మరని ఉదహరణగా చెప్పారు. ఉద్వేగాలు, భావాల్లో కొట్టుకుపోతూ ఏది సత్యం, ఏది అసత్యం అని గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని వాపోయారు. నిజమైన వార్తలను వ్యాపింపజేయడంలో సాంకేతికతను వాడుకోవాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ప్రజలకు అభివృద్ధికరం, ఆరోగ్యకరం అనే ప్రత్యామ్నాయ భావాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రత్నామ్నాయ భావాలను పదునుగా, శక్తిగా ప్రమోట్ చేస్తే ఆ మేరకు తప్పనిసరిగా విజయం సాధించవచ్చునన్నారు.
జూలూరీ గౌరీశంకర్ మాట్లాడుతూ...మీడియా ఛానళ్లలో స్కోలింగ్లకు, బ్రేకింగ్‌లకు సాహిత్యాన్ని అద్ది వన్నె తెచ్చిన వ్యక్తి అరుణ్‌సాగర్ అని కొనియాడారు. ప్రసాదమూర్తి రాసిన కలనేత కవిత్వం ఆయనను తిలక్ సరసన నిలబెట్టిందని ప్రశంసించారు. సాహిత్య అకాడమి నుంచి అరుణ్‌సాగర్ సాహిత్యాన్ని ఒక పుస్తకరూపంలో తీసుకొస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమ కాలంలో అరుణ్సాగర్తో ఉన్న అనుబం ధాన్ని పంచుకున్నారు. ఆయన రీతిలో ఆధునిక కవిత్వం రాయటం మిగతావారికి సాధ్యం కాదన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్ఎన్ఆర్ ఒకే సంస్థలో 36 ఏండ్ల నుంచి పనిచేస్తూ ముందుకు సాగటం అభినందనీయమన్నారు. కొత్త తరం జర్నలిస్టులలో పుస్తకాల, సాహిత్య అధ్యయన అలవాటు తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీ ఎస్సీ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..తక్కువగా మాట్లాడేవారిలోనూ, సమాజంలో తమకుతాముగా ఫోకస్ కాని వారిలోనూ మేధావులుంటా రనీ, అందుకు నిదర్శనమే ఎం.నాగేశ్వర్రావు అని ప్రశంసించారు. చివరి వరకూ అరుణ్‌సాగర్ వెంట నడిచిన వ్యక్తి ప్రసాదమూర్తి అని కొనియాడారు. కవి, సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ గొప్ప మార్క్సిస్టు, ప్రజాదృక్పథం కలిగి ఉన్న జర్నలిస్టు అన్నారు. ప్రజా దృక్పథంలో ఆలోచించని జర్నలిస్టులు సరైన వార్తలు రాయలేరన్నారు. కళాకారులు అంత:శ్చేదన నుంచి తయారవుతారన్నారు. పురస్కార గ్రహీత ప్రసాదమూర్తి మాట్లాడుతూ..అరుణ్సాగర్తో ఉన్న అనుంబంధాన్ని పంచుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు బాగైతేనే..సమాజం బాగు : అరుణ్‌సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కార గ్రహీత, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు,
ప్రభుత్వ పాఠశాలలు బాగైతేనే సమాజం దానంతట అదే బాగవుతుందని ఈనాడు ఎడిటర్, అరుణ్‌సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కార గ్రహీత ఎం.నాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. జర్నలిజం వైపు ప్రతిభావంతులు రావడం లేదనీ, ప్రజాకోణంలో విశ్లేషించి వార్తలు రాసే పాత్రికేయుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రధాన మీడియా స్రవంతి ప్రాభవం కోల్పోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. అరుణ్‌సాగర్ వ్యక్తిత్వంలో ఉన్న స్వచ్ఛత, స్పష్టత రాతల్లో, మాటల్లో, కవితల్లో స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నారు. ఆయన పేరుతో పురస్కారాలివ్వడం వర్ధమాన జర్నలిస్టులకు ప్రేరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు. నాగేశ్వరరావు తనకి పురస్కారం కింద ఇచ్చిన నగదు పారితోషికాన్ని అరుణ్‌సాగర్ కూతురు శ్రితకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి శిఖామణి, ఆలిండియా రేడియో ఉద్యోగి ఎస్.నాగమల్లేశ్వరరావు, సభా నిర్వాహకులు మువ్వా శ్రీనివాసరావు, ఎం.రాజ్‌కుమార్, వై.జె.రాంబాబు, టి.జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.