Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 10 నుంచి వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేటి నుంచి 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వీరికి సోమవారం నుంచి కోవాగ్జిన్ మొదటి డోసు టీకాను వేయనున్నారు. వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషనరీ (బూస్టర్) వ్యాక్సినేషన్ జనవరి 10 నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే వీరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. కాగా రెండో డోసు తీసుకున్న తర్వాత తొమ్మిది నెలలు లేదా 39 వారాల తర్వాత ఈ డోసును వేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన అర్హులైన వారి డాటాను కోవిన్ పోర్టల్ నుంచి, 15 నుంచి 18 ఏండ్లు, 60 ఏండ్ల పైబడిన దీర్ఘకాలిక రోగుల వివరాలను కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ నుంచి తెప్పించుకున్నారు.
ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
రాష్ట్రంలో 15 నుంచి 18ఏండ్ల లోపు వారిసంఖ్య దాదాపుగా 22,78, 683 ఉంటుందనీ, దానికి సంబంధించిన వివరాలను కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే రాష్ట్రానికి అందజేశారు. పెద్ద వారికి ఇచ్చినట్టుగానే వీరికి కూడా 0.5 ఎంఎల్ టీకాను ఇస్తారు. జనవరి ఒకటి నుంచి కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంకల్పించారు. జీహెచ్ఎంసీతో పాటు 12మున్సిపల్ కార్పొరే షన్ల పరిధిలో ఉన్న వారు కోవిన్ పోర్టల్ లో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినప్రాంతాల్లో ప్రజలునేరుగా వెళ్లిటీకా తీసుకోవచ్చు. 2007లో లేదా అంత కన్నా ముందు జన్మించిన వారు ఈ కేటగిరీలో ఉన్నారు. పిల్లల పట్ల మరింత జాగ్రత్త కోసం వారివెంట వచ్చేందుకు తల్లిదండ్రులను అనుమతిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30నిమిషాలు అక్కడే పర్యవేక్షణ లో ఉంచుతారు. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు....
గతేడాది జనవరి 16న వైద్యారోగ్యసిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీరిలో గడువులోగా రెండో డోసు తీసుకున్న వారంతా ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో తీసుకున్నారు. ఇలా ఫిబ్రవరిలో రెండో డోసు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఏడాది జనవరిలో ముందు జాగ్రత్తగా ఇస్తున్న డోసును తీసుకునేందుకు అర్హులు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు గతేడాది ఫిబ్రవరి 5న మొదటి డోసు, మార్చిలో రెండో డోసు ఇచ్చారు. వారు కూడా ఈ జనవరిలోనే బూస్టర్ డోసు తీసుకోవాలి. అయితే వీరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయించాల్సి ఉన్నది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. లబ్దిదారుల వివరాలతో కూడిన జాబితాను కోవిన్ పోర్టల్ లో అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
60 ఏండ్లు పైబడిన వారికి ....
60 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు గతేడాది మార్చి ఒకటిన మొదటి డోసు ఇవ్వడం ప్రారంభించగా రెండో డోసు ఏప్రిల్ మూడో లేదా చివరి వారంలో రెండో డోసు తీసుకున్నారు. గడువులోగా రెండో డోసు తీసుకున్న వారికి మూడో డోసును ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలెడతారు. వీరికి డాక్టర్ల సలహా మేరకు టీకా ఇస్తారు. వీరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉన్నది. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇప్పటికే సిబ్బందికి శిక్షణనిచ్చింది.