Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు తీసుకున్నా జాడలేని హక్కుపత్రాలు
- గడువు ముగిసి నెలైనా ముందుకు సాగని ప్రక్రియ
- పేరుకే ఎఫ్ఆర్సీ.. కార్యదర్శుల ద్వారానే అప్లికేషన్లు
- అశాస్త్రీయ సర్వేతో అయోమయంలో అధికారులు
- జాప్యం చేస్తే మరోసారి ఉద్యమిస్తామంటున్న గిరిజన సంఘాలు
ఖమ్మం జిల్లా ఎల్లన్ననగర్ నుంచి కె.శ్రీనివాసరెడ్డి
పోడు ఉద్యమాలు ఊపందుకోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం హక్కుపత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అప్లికేషన్ల గడువు ముగిసి దాదాపు నెలరోజులైనా హక్కుపత్రాల జాడ లేకపోవడంతో ఆదివాసీ, గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలల పాటు కొనసాగాల్సిన దరఖాస్తుల ప్రక్రియను ఎక్కువ సమయం ఇస్తే అధికంగా అప్లికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో నెల రోజుల్లో సర్కారు మమ అనిపించింది. గతేడాది నవంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు మాత్రమే ప్రధానం గా దరఖాస్తులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం అటవీ హక్కు కమిటీ (ఎఫ్ఆర్సీ) ద్వారా దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా గ్రామ కార్యదర్శులు స్వీకరించారు. ప్రభుత్వ దుర్బుద్ధిని ముందే గుర్తించి గిరిజన, ఆదివాసీలు ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలోనూ అనేక కొర్రీలు పెట్టినా సరైన ఆధారాలతో దరఖాస్తులిచ్చారు. అశాస్త్రీయమైన శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించిన పోడు భూముల కన్నా అధికమొత్తంలో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ కారణంగా దరఖాస్తుల స్వీకరణ అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియలో ముందడుగు పడటం లేదని తెలుస్తోంది. ఎలాగోలా పోడుహక్కు పత్రాలను ఓ ఏడాదిపాటు సాగదీసి ఎన్నికలకు ముందు వాటిని ఇచ్చి లబ్దిపొందాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి...
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల ఎకరాలకు సుమారు 2.5 లక్షల మంది గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ సహా మొత్తం 24 జిల్లాలో పోడు భూముల సమస్య ఉంది. ఆయా జిల్లాల నుంచి 1.40 లక్షల వరకు గిరిజనులు, 1.10లక్షల వరకు గిరిజనేతరులు అప్లికేషన్లు సమర్పించారు. సుమారు 4.5 లక్షల ఎకరాల వరకు గిరిజనులు, రెండున్నర లక్షల ఎకరాలకు గిరిజనేతరులు దరఖాస్తులు చేశారు. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధికమొత్తం భూములకు అప్లికేషన్లు రావడంతో మీమాంసలో పడింది. ఆర్వోఎఫ్ఆర్- 2006 అమల్లోకి వచ్చాక ఆ ఏడాది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొంత మొత్తం పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడుభూములపై ప్రకటన చేసిన కేసీఆర్ దాన్ని అమలు చేయకపోవడంతో మూడేండ్లుగా అనేక ఉద్యమాలు సాగాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లోని 70 మంది బిట్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 5, 2021న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు 'సడక్‌బంద్'కు పిలుపునిచ్చాయి. దాంతో దిగివచ్చిన ప్రభుత్వం హక్కుపత్రాల జారీకి ముందుకొచ్చింది. అఖిలపక్ష సమావేశాలు, హడావుడి చేసి మొదలు పెట్టిన ఈ ప్రక్రియలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించకపోవడంతోనే నెలల తరబడి జాప్యం జరుగుతోందని గిరిజన సంఘాలు అంటున్నాయి.
అధిక దరఖాస్తులతో అయోమయం
పోడుభూములపై హక్కు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించే క్రమంలో ఖమ్మం జిల్లాలో 8,208 మంది 17,449 ఎకరాల్లో పోడు సాగిస్తున్నట్టు అశాస్త్రీయమైన శాటిలైట్ సర్వే ద్వారా జిల్లా యంత్రాంగం గుర్తించింది. కానీ గ్రామ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీకి జిల్లాలో 18,603 మంది 42,560.36 ఎకరాలకు హక్కు కల్పించాలని దరఖాస్తు చేశారు. వీరిలో 9,572 మంది గిరిజనులు 24,629 ఎకరాలకు, 9,031 మంది గిరిజనేతరులు 17,931 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ, అటవీ అధికారుల సర్వేలో నిర్ధారించిన దానికన్నా ఎక్కువ భూములకు దరఖాస్తులు అందడంతో యంత్రాంగం సందిగ్ధంలో పడింది. దరఖాస్తుల వివరాలు సరిచూసుకునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేపట్టాలి, ఆ తర్వాత అర్హులెవరనేది గ్రామసభలో తీర్మానం చేయాలి, ఆ దరఖాస్తులను సబ్‌డివిజన్ లెవల్ కమిటీకి పంపించి, ఆ తర్వాత కలెక్టర్‌కు నివేదించాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వాలంటే ఇంకా నెలలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల ముందు దాకా దీన్ని సాగదీసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు గిరిజన సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల దాకా సాగదీయాలనే కుట్ర
ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా సర్వే చేయాలి కానీ ఇప్పటి వరకు చేయలేదు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సరిచూసుకుని పై కమిటీకి పంపాలి. ఎన్నికల సమయం దాకా దీన్ని సాగదీసేందుకే ఇలా వ్యవహరిస్తుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఈ ప్రక్రియను కొనసాగిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఉద్యమాలను నిలవరించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్టు సందేహం కలుగుతోంది. అశాస్త్రీయ సర్వే ద్వారా తక్కువ భూములు చూపించి ఎక్కువ భూములకు దరఖాస్తులు వచ్చాయనడంలో అర్థంలేదు. ఈ క్రమంలో పోడుదారులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తే మరో ఉద్యమానికి వెనుకాడం.
- భూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం, ఖమ్మం జిల్లా కార్యదర్శి
దరఖాస్తు చేసి రెండు నెలలైంది
మా ఊరు గుబ్బగుర్తి. భూమికి దగ్గరగా ఉండాలని ఎల్లన్ననగర్‌లో గుడిసెవేసుకున్నాను. 70 ఎకరాల బిట్లో పోడు కొట్టుకుని సాగు చేయబట్టి 40 ఏండ్లయింది. ఆగస్టులో అటవీ అధికారులు మా భూములపై దాడులు చేసి, పంటలు నాశనం చేశారు. నాతో పాటు 21 మందిపై కేసు పెట్టి ఖమ్మం జైలుకు పంపారు. ఆ తర్వాత హక్కుపత్రాలకు దరఖాస్తు చేసుకోమనడంతో నవంబర్‌లో 5 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నా. అప్పటినుంచి అధికారులు వచ్చి సర్వే చేసి, పట్టాలిస్తారని చూస్తున్నా. రెండు నెలలైనా ఆ ఊసే లేదు.
- గోగుల సోములు,ఎల్లన్ననగర్, కొణిజర్ల