Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండిసంజయ్ కుమార్‌పై అక్రమ కేసులు తగదు
- తక్షణమే విడుదల చేయాలి : బీజేపీ
- నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా రాక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును, 14 రోజుల రిమాండ్‌ను నిరసిస్తూ మంగళవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళనల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనమీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, జాతీయ నాయకులు, పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ప్రజల కోసం, ఉద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజరుని అరెస్టు చేయడాన్ని ఖండించారు. బండి సంజరు సహా నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనీ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న 317 జీవోను తక్షణమే సవరించాలని కోరారు. 14 రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రతి రోజూ జాతీయ నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. మంగళవారం సాయంత్రం జేపీ నడ్డా హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందనీ, కేసీఆర్‌కు ప్రజలు చరమ గీతం పాడుతారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గూడూరు నారాయణరెడ్డి, విజయశాంతి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. బండి అరెస్టును ఖండించారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని తెలిపారు.
బండి అరెస్టును ఖండిస్తున్నాం :బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా
ఎంపీ, తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ పై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.