Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్లో చెప్పలేక.. ఓ జంట..
- పెద్దలు పెండ్లికి నిరాకరించారని మరో జంట..
- సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో ఘటనలు
నవతెలంగాణ-పుల్కల్/వాంకిడి
చెట్టుకు ఉరేసుకుని రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. తప్పు చేశామనీ, ఇంట్లో చెప్పే ధైర్యం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నామనీ సంగారెడ్డిలో ఓ జంట సూసైడ్ నోట్ రాయగా, మంచిర్యాలలో మరో జంట.. పెద్దలు పెండ్లికి అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన శివ, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురంకు చెందిన అమృత.. హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌నోట్ రాసి.. సంగారెడ్డి బుదేరా గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. 'అమ్మా, నాన్న మమ్మల్ని క్షమించండి. మేము తెలియకుండా తప్పు చేశాం. అది మీకు చెప్పే ధైర్యం లేక ఇలా చేసుకుంటున్నాం. మేము చేసిన తప్పు మీకు చెప్పి మీ ముందు తిరగలేం. తెలియక చేసిన తప్పు ఈ రోజు ఇలా ప్రాణాల మీదకి వస్తుందని అనుకోలేదు. తమ్ముడిని మంచిగా చదువుకోమని చెప్పండి. అందరు ఇబ్బంది పడకండి మంచిగా ఉండండి. మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం. గుండుని అడిగినట్టు చెప్పండి. లాస్ట్‌గా అందిరినీ చూడాలని ఉంది కానీ చూడలేను.' అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన ఎనుములె గీత(20), అదే కాలనీకి చెందిన నవ్గడె శ్రీకాంత్(22) రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 20న గీత, శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. బంధువుల ఇండ్లలో వెతికినా ఎక్కడా వారి ఆచూకీ లభించలేదు. వారి వద్ద ఉన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. కుటుంబసభ్యులు పెండ్లికి ఒప్పుకోరనే భయంతో మండలంలోని హక్కిని గ్రామ శివారులో చెట్టుకు మూడు రోజుల కిందటే ఉరేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు.