Authorization
Sat April 12, 2025 01:27:15 am
- మంత్రి గంగుల వ్యాఖ్యలు సరికాదు : ఎస్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన జీవో నెంబర్ 317 విడుదలైన తర్వాతే ఉపాధ్యాయ సంఘాలతో విద్యామంత్రి సమావేశం నిర్వహించారని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 6న ప్రభుత్వం విడుదల చేసిందనీ, అదేనెల 13న ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. ఈ జీవోలో అవసరమైన మార్పులను, స్థానికత, స్పౌజ్ వంటి అంశాలను చేర్చాలని కోరామని తెలిపారు. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా తక్కువ సమయంలో పొరపాట్లకు తావిచ్చి ముందుకెళ్తున్నదని విమర్శించారు. ఇంకోవైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 317 జీవో విడుదలకు ముందే సంఘాలతో సమావేశం జరిగిందని మీడియాలో వ్యాఖ్యానించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సూచనలు పాటించి ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి గంగుల వ్యాఖ్యలకు టీపీటీఎఫ్ ఖండన
గుర్తింపు పొందిన సంఘాలతో సమావేశం తర్వాతే 317 జీవోను ప్రభుత్వం విడుదల చేసిందన్న మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను టీపీటీఎఫ్ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ జీవోను ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిందని విమర్శించారు. గతనెల 4న టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారని గుర్తు చేశారు. కానీ ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను ఆహ్వానించలేదని తెలిపారు. ఉపాధ్యాయుల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి గతనెల 13న విద్యామంత్రి సమావేశం నిర్వహించారని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని 317 జీవో వల్ల బాధితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికతను చూడకుండా ఇతర జిల్లాలకు వెళ్లిన వారిని తిరిగి సొంత జిల్లాకు తెచ్చే చర్యలు చేపట్టాలని సూచించారు.
317 జీవోను సవరించాలి : టీపీయూఎస్
జీవోనెంబర్ 317ను సవరించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. గుర్తింపు పొందిన ఎనిమిది సంఘాలతో సమావేశం జరిగిందనీ, రాతపూర్వకంగా సలహాలు, సూచనలు తీసుకున్నామంటూ మంత్రి గంగుల కమలాకర్ ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. ఇతర జిల్లాలకు అయిష్టంగా కేటాయించిన ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాకు వచ్చేలా జీవోను విడుదల చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజరు అరెస్టును ఖండించారు.